మిథాలీ
పోచెఫ్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళ జట్టు జోరు కొనసాగుతోంది. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత్ టి20 సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ (48 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మిథాలీకి టి20ల్లో ఇది 11వ అర్ధసెంచరీ. మిథాలీతోపాటు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న 17 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్), వేద కృష్ణమూర్తి (22 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించడంతో... భారత్ 18.5 ఓవర్లలో 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టి20ల్లో భారత జట్టుకు ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. గతంలో ఆస్ట్రేలియాపై 141 పరుగుల చేధనే అత్యధికంగా ఉండేది.
మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ (38; 5 ఫోర్లు, 1 సిక్స్), డు ప్రీజ్ (31; 5 ఫోర్లు) ఆకట్టుకోగా... చివర్లో ట్రియాన్ (7 బంతుల్లో 32; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) బౌండరీలతో విరుచుకుపడటంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో అనుజా 2, శిఖా, పూజ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేధనలో బరిలోకి దిగిన భారత్‌కు మిథాలీ, స్మృతి (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించారు.
వీరిద్దరు తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అనంతరం వరుస బంతుల్లో మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (0) ఔటైనా... జెమీమాతో మిథాలీ మూడో వికెట్‌కు 69, వేదతో నాలుగో వికెట్‌కు అజేయంగా 52 పరుగులు జతజేసింది. దీంతో భారత్ మరో 7 బంతులు మిగిలుండగానే 168 పరుగులు చేసి గెలుపొందింది. అజేయంగా జట్టును గెలిపించిన మిథాలీకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి మడమ గాయం కారణంగా ఈ మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కు దూరమైంది.
Comments
Please login to add a commentAdd a comment