మహిళల ఐపీఎల్‌కు ఇదే సరైన సమయం..
లార్డ్స్: మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఇదే సరైన సమయమని భారత మహిళల కెప్టెన్ మిథాలీరాజ్ అభిప్రాయపడింది. భారత్ మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని అది మహిళా క్రికెట్‌కు ఆర్థికంగానే కాకుండా ఆట నైపుణ్యాలను పెంపొందిస్తుందని మిథాలీ పేర్కొంది. ఇక భారత మహిళలు ఒత్తిడి తట్టుకోలేకపోయారని దీనికి సరైన కారణం అనుభవం లేకపోవడమనే మిథాలీ పేర్కొంది. భారత మహిళలు రాణించాలంటే ఐపీఎల్ లాంటి లీగ్‌లు ఆడే అవకాశం కల్పించాలని ఈ లేడీ కెప్టెన్ వాపోయింది.
ఇంగ్లండ్ మహిళలకు ఇక్విలెంట్ సూపర్ లీగ్, ఆస్ట్రేలియాకు బిగ్ బాష్ లీగ్‌లు ఉన్నాయని ఈ తరహాలోనే భారత్‌లో మహిళల ఐపీఎల్ ప్రారంభించాలని మిథాలీ అభిప్రాయపడింది. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన స్మృతి మంధన, హర్మన్ ప్రీత్ కౌర్ టోర్నిలో అద్భుతంగా రాణించారని గుర్తు చేస్తూ.. మిగిలిన మహిళలు కూడా లీగ్‌లు ఆడటం ద్వారా అనుభవంతో పాటు ఆటను మెరుగు పరుచుకుంటారని మిథాలీ పేర్కొంది.
ఈ లీగ్‌లతో మంచి ప్రాక్టీస్ లభించడంతో పాటు మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుందని మిథాలీ వ్యాఖ్యానించింది. ఇంగ్లండ్ గత రెండు సంవత్సరాల నుంచి ఫ్రోఫెషనల్ మ్యాచ్‌లు ఆడుతున్నారని అది వారికి కలిసొచ్చిందని తెలిపింది. మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కావడం మహిళా క్రికెటర్లుగా మేం గర్విస్తున్నామని మిథాలీ సంతోషం వ్యక్తం చేసింది. పూనమ్, కౌర్ పోరాటం అద్భుతమని.. ఆ భాగస్వామ్యాన్ని నిలబెట్టలేకపోయామని వారి ప్రదర్శనను ప్రశంసించింది. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, బీసీసీఐ మహిళల ప్రదర్శన పట్ల సుముఖంగా ఉందని భావిస్తున్నామని మిథాలీ తెలిపింది.