
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ కాలేజి బాస్కెట్‌బాల్ లీగ్ (ఐసీబీఎల్)లో మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ), సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి జట్లు విజేతలుగా నిలిచాయి. ఉత్కంఠ రేకెత్తించిన పురుషుల ఫైనల్లో ఎంఎల్‌ఆర్‌ఐటీ 87–86తో లయోలా అకాడమీపై విజయం సాధించింది. చివరి సెకనులో క్రిస్ వీరేశ్ సాధించిన పాయింట్‌తో ఎంఎల్‌ఆర్‌ఐటీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా ఎంఎల్‌ఆర్‌ఐటీ 83–86తో వెనుకబడింది. అయితే ఒత్తిడిని అధిగమించిన ఆటగాళ్లు వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోరు 86–86తో సమమైంది. మ్యాచ్ డ్రా కావడం ఖాయంగా కనిపించింది. అయితే ఈ దశలో అద్భుతం చేసిన క్రిస్ వీరేశ్ (23 పాయింట్లు) చివరి సెకనులో బంతిని బాస్కెట్‌లో వేసి జట్టుకు విజయాన్నందించాడు.
దినేశ్ కుమార్ (13 పాయింట్లు), పథ్వీ కుమార్ (12 పాయింట్లు) వీరేశ్‌కు చక్కగా సహకరించారు. లయోలా అకాడమీ జట్టులో సల్మాన్ ఖాన్ (25 పాయింట్లు), సాయి కుమార్ (17 పాయింట్లు), డేవిడ్ (15 పాయింట్లు) ఆకట్టుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వీఎన్‌ఆర్ వీజేఐఈటీ 77–54తో భవన్స్ సైనిక్‌పురిపై నెగ్గింది. మహిళల టైటిల్ పోరులో సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి జట్టు 63–49తో లయోలా అకాడమీపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున మావ్‌జీత్ (24), రచన (19), అర్చన (14) దూకుడుగా ఆడారు. లయోలా జట్టులో మానస (20), శరణ్య (10) పోరాడారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన మహిళలు, పురుషుల జట్లు ఆలిండియా ఐసీబీఎల్ టోర్నీకి అర్హత సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. విజేతగా నిలిచిన జట్లకు రూ. 25 వేలు, రన్నరప్‌కు రూ. 15 వేలు నగదు బహుమతిగా లభించగా... మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ అధ్యక్షుడు జయకర్ డేనియల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment