అజహరుద్దీన్ న్యాయ పోరాటం
ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులను కొట్టేయండి
కేసు తేలే వరకు ఫలితాలు వెల్లడి కాకుండా చూడండి
సాంకేతిక కారణాలతో నా నామినేషన్‌ను తిరస్కరించారు
హైకోర్టులో పిటిషన్... విచారణ సోమవారానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల విషయంలో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ న్యాయ పోరాటం ప్రారంభించారు. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ, వాటి పర్యవేక్షణ నిమిత్తం అడ్వొకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేస్తూ రంగారెడ్డి జిల్లా ఐదవ అదనపు జిల్లా, సెషన్‌స జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు తేలేంత వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి విచారణ జరిపారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా కింది కోర్టు ఉత్తర్వులున్నాయని అజహరుద్దీన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కింది కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసులో పిటిషనర్ సైతం ప్రతివాదిగా చేరారని వివరించారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా పిటిషనర్ హెచ్‌సీఏ అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారని, అయితే రిటర్నింగ్ అధికారి సాంకేతిక కారణాలతో నామినేషన్ ఇవ్వడానికి తిరస్కరించారన్నారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో పాల్గొనేందుకు పిటిషనర్ అన్ని విధాలుగా అర్హులని, ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలిపినా అతను పట్టించుకోలేదన్నారు. నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పిన రిటర్నింగ్ అధికారి అందుకు కారణాలను మాత్రం వివరించలేదన్నారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా, ఓటర్ల వివరాలు ప్రచురించకుండా, ఎన్నికల అధికారులను నియమించకుండా, లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారి ఎన్నికలను నిర్వహించారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు కింది కోర్టును తప్పుదోవ పట్టించి ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు తీసుకొచ్చారన్నారు. కోర్టు ముందు వాస్తవాలను ఉంచలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.