
హెచ్‌సీఏ ఎన్నికల బరిలో అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ పరిపాలనలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ పడేందుకు అతను సిద్ధమవుతున్నాడు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు.
ఇటీవల 500వ టెస్టులో సన్మానం సహా గతంలోనూ కొన్ని బోర్డు కార్యక్రమాలకు ఆహ్వానించినా... అజహర్ పదవులు చేపట్టడంపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎన్నికల్లో పోటీ చేయడం అనే అంశం మళ్లీ వివాదం రేపే అవకాశం ఉంది. మరోవైపు అజహర్ ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుడొకరు నిర్ధారించారు. ‘హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయాలని అజహర్ నిర్ణయం తీసుకున్నాడు. కోర్టు నిర్ణయంపై బోర్డు అప్పీల్‌కు వెళ్లలేదు కాబట్టి ఆ తీర్పును గౌరవించినట్లే. పోటీకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు’ అని ఆయన చెప్పారు. భారత్ తరఫున అజహర్ 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.