షెహజాద్ వీరవిహారం
షార్జా: నాణ్యమైన ప్రత్యర్థి ఎదురైనా... ఏమాత్రం తడబాటు లేకుండా ఆడిన అఫ్గానిస్తాన్ జట్టు ఓపెనర్ మొహమ్మద్ షెహజాద్ (67 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండో టి20 మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. జింబాబ్వే బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. దీంతో షార్జా క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసింది. షెహజాద్ 52 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఘని (5), అస్గర్ (18), కరీమ్ (12) విఫలమైనా... షెహజాద్ మాత్రం చివరి వరకు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు.
కీలకభాగస్వామ్యాలను నెలకొల్పుతూ ప్రతి బంతిని పరుగుగా మల్చడంతో అఫ్గాన్ రన్‌రేట్ వేగంగా పరుగెత్తింది. చివర్లో ధాటిగా ఆడిన నబీ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) షెహజాద్‌తో ఐదో వికెట్‌కు 47 పరుగులు జత చేశాడు. అఫ్గాన్ బ్యాట్స్‌మన్ వీరబాదుడును అడ్డుకోలేకపోయిన జింబాబ్వే బౌలర్లు పదేపదే వైడ్లు వేయడం... ఫీల్డింగ్‌లోనూ ఒత్తిడికి లోనై సులభంగా అందుకోవాల్సిన క్యాచ్‌లను జారవిడిచి భారీ స్కోరుకు కారకులయ్యారు.