sharjah cricket stadium
-
షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా
దుబాయ్ : ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలిఉంది. ఇప్పటికే లీగ్‌లో పాల్గొనే జట్లన్నీ తమ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈసారి ఐపీఎల్లో మ్యాచ్‌లన్నీ షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా జరగనున్నాయి. కాగా సెప్టెంబర్ 9న దుబాయ్ వెళ్లిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిబంధనల ప్రకారం ఆరు రోజల క్వారంటైన్ పూర్తి చేసుకొని ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. తాజాగా మంగళవారం ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్, సీవోవో హేమంగ్ అమిన్‌తో కలిసి దాదా షార్జా స్టేడియం పరిసరాలను సందర్శించాడు. (చదవండి : 6 నెలల తర్వాత తొలిసారి విమానం ఎక్కా) ఈ సందర్భంగా గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షార్జా స్టేడియం ఫోటోలను షేర్ చేశాడు. ' కరోనా నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ దుబాయ్‌లో జరుగుతుంది. మ్యాచ్‌లు జరగనున్న షార్జా స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఐకానిక్ స్టేడియంలో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఐపీఎల్ ద్వారా భారత యువ ఆటగాళ్లు షార్జా స్టేడియంలో మ్యాచ్‌లు ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్లకు కూడా ఈ స్టేడియంలో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.' అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీకి షార్జా స్టేడియంలో ఘనమైన రికార్డు ఉంది. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో మొత్తం 700 పరుగులకు పైగా సాధించాడు. ఐపీఎల్ 13వ సీజన్ మూడు వేదికల్లో ఒకటైన షార్జాలో మొత్తం 12 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్ 22న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఈ స్టేడియంలో తొలిమ్యాచ్ జరగనుంది. (చదవండి : నెట్ బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్!) -
షెహజాద్ వీరవిహారం
షార్జా: నాణ్యమైన ప్రత్యర్థి ఎదురైనా... ఏమాత్రం తడబాటు లేకుండా ఆడిన అఫ్గానిస్తాన్ జట్టు ఓపెనర్ మొహమ్మద్ షెహజాద్ (67 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండో టి20 మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. జింబాబ్వే బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. దీంతో షార్జా క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసింది. షెహజాద్ 52 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఘని (5), అస్గర్ (18), కరీమ్ (12) విఫలమైనా... షెహజాద్ మాత్రం చివరి వరకు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. కీలకభాగస్వామ్యాలను నెలకొల్పుతూ ప్రతి బంతిని పరుగుగా మల్చడంతో అఫ్గాన్ రన్‌రేట్ వేగంగా పరుగెత్తింది. చివర్లో ధాటిగా ఆడిన నబీ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) షెహజాద్‌తో ఐదో వికెట్‌కు 47 పరుగులు జత చేశాడు. అఫ్గాన్ బ్యాట్స్‌మన్ వీరబాదుడును అడ్డుకోలేకపోయిన జింబాబ్వే బౌలర్లు పదేపదే వైడ్లు వేయడం... ఫీల్డింగ్‌లోనూ ఒత్తిడికి లోనై సులభంగా అందుకోవాల్సిన క్యాచ్‌లను జారవిడిచి భారీ స్కోరుకు కారకులయ్యారు. -
‘సన్’కు చెన్నై స్ట్రోక్
సూపర్ కింగ్స్ మరో విజయం 5 వికెట్లతో హైదరాబాద్ ఓటమి చెలరేగిన డ్వేన్ స్మిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బలం, బలగం జోరు ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. జట్టు టాప్ ఆర్డర్ విఫలం కాగా... కనీస ప్రదర్శన ఇవ్వలేని పేలవమైన లైనప్‌తో ఆ జట్టు మరోసారి భంగపడింది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో పరాజయం తర్వాత చెన్నై సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా సూపర్ కింగ్స్ ఐపీఎల్లో వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోగా... సన్‌రైజర్స్ మూడో ఓటమిని మూటగట్టుకుంది. షార్జా: ఐపీఎల్లో జోరు మీదున్న ధోని సేన మరో గెలుపును సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడ షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (45 బంతుల్లో 44; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోహిత్ శర్మ, హిల్ఫెన్హాస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అదనపు బౌలర్‌గా ఇషాంత్ శర్మను తీసుకోవడంతో హైదరాబాద్ బ్యాటింగ్ బలహీనంగా మారి తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం డ్వేన్ స్మిత్ (46 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (33 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా కీలకపాత్ర పోషించాడు. మెరుపులే లేవు... చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నెమ్మదిగా ఆరంభమైన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ వేగంగా సాగలేదు. హిల్ఫెన్హాస్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి ధావన్ (7) వెనుదిరగ్గా... వార్నర్ (0) అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. లెగ్‌స్టంప్ బయట పడిన బంతి, వార్నర్ ప్యాడ్లపై చాలా ఎత్తులో తాకినా అంపైర్ అవుటిచ్చాడు. ఈ దశలో ఫించ్, రాహుల్ (27 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 37 పరుగులకు చేరింది. రాహుల్‌ను స్మిత్ అవుట్ చేయడంతో 52 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన వేణుగోపాలరావు (13) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఫించ్ వెనుదిరిగాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సన్ స్కోరు 113 పరుగులు మాత్రమే. అయితే స్యామీ (15 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) భారీ షాట్లు ఆడి చివరి 2 ఓవర్లలో 32 పరుగులు రాబట్టారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 16 బంతుల్లో 36 పరుగులు జోడించారు. సూపర్ ఓపెనింగ్... వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నైకి ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో జట్టు పవర్ ప్లేలో 47 పరుగులు చేసింది. ముఖ్యంగా స్మిత్ భారీ షాట్లతో చెలరేగాడు. ఇషాంత్ తొలి ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లు కొట్టి ఊపు తెచ్చాడు. ఎట్టకేలకు కరణ్ శర్మ బౌలింగ్‌లో మెకల్లమ్ వెనుదిరిగడంతో 85 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు ఫామ్‌లో ఉన్న స్మిత్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రైనా (14) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ధాటిగా ఆడుతున్న స్మిత్‌తో పాటు డు ప్లెసిస్ (0)ను భువనేశ్వర్ ఒకే ఓవర్లో అవుట్ చేయగా, వెంటనే జడేజా (6) కూడా వెనుదిరగడంతో సన్ శిబిరంలో ఆశలు రేగాయి. అయితే ధోని (14 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్) నిలబడి మూడు బంతుల ముందే జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) మోహిత్ 44; ధావన్ (సి) మన్హాస్ (బి) హిల్ఫెన్హాస్ 7; వార్నర్ (ఎల్బీ) (బి) హిల్ఫెన్హాస్ 0; రాహుల్ (సి) పాండే (బి) స్మిత్ 25; వేణు (సి) స్మిత్ (బి) మోహిత్ 13; స్యామీ (నాటౌట్) 23; కరణ్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 145 వికెట్ల పతనం: 1-15; 2-15; 3-67; 4-98; 5-109. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-32-2; పాండే 3-0-22-0; మోహిత్ 4-0-27-2; అశ్విన్ 4-0-17-0; జడేజా 3-0-23-0; స్మిత్ 2-0-11-1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 66; మెకల్లమ్ (బి) కరణ్ 40; రైనా (సి) వేణు (బి) ఇషాంత్ 14; ధోని (నాటౌట్) 13; డు ప్లెసిస్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0; జడేజా (బి) ఇషాంత్ 6; మన్హాస్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 146 వికెట్ల పతనం: 1-85; 2-114; 3-126; 4-127; 5-138. బౌలింగ్: స్టెయిన్ 4-0-20-0; భువనేశ్వర్ 4-0-23-2; కరణ్ శర్మ 4-0-35-1; మిశ్రా 3.3-0-27-0; ఇషాంత్ 4-0-37-2. -
లిన్ ‘విన్నర్’
క్రిస్‌లిన్ సంచలన క్యాచ్ తో నెగ్గిన కోల్‌కతా ఉత్కంఠపోరులో బెంగళూరుకు నిరాశ క్యాచ్‌లు మ్యాచ్‌ల్ని గెలిపిస్తాయంటారు... నిజమే... ఒక్క క్యాచ్ బెంగళూరు నోటి దగ్గర విజయాన్ని దూరం చేసింది. ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్‌లు చేసే విన్యాసాన్ని తలపిస్తూ క్రిస్‌లిన్ అందుకున్న సంచలన క్యాచ్‌తో... కోల్‌కతా ఖాతాలో అసాధారణ విజయం చేరింది. 19.3 ఓవర్ల పాటు బెంగ ళూరు చేతిలో ఉన్న మ్యాచ్‌ను ఒకే ఒక్క క్యాచ్‌తో ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్‌లిన్ కోల్‌కతా ఖాతాలో చేర్చాడు. షార్జా: సులభంగా గెలవాల్సిన మ్యాచ్... చేతులో కావల్సినన్ని వికెట్లు... ఏ జట్టుకు లేనంత బలమైన బ్యాటింగ్ లైనప్... కానీ ఫలితం లేదు... టి20 ప్రపంచకప్ ఫైనల్‌ను తలపిస్తూ యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ బెంగళూరు కొంప ముంచింది. రెండు, మూడు ఓవర్లు మిగిలి ఉండగానే గెలవాల్సిన మ్యాచ్‌ను మాల్యా జట్టు చేజేతులా పొగొట్టుకుంది. తాము గెలుస్తామనే నమ్మకం ఏ కోశానా లేని కోల్‌కతా నైట్ రైడర్స్ బెంగళూరు చెత్త బ్యాటింగ్ కారణంగా అనూహ్యంగా విజయం సాధించింది. గురువారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గంభీర్ సేన 2 పరుగుల తేడాతో కోహ్లి బృందంపై నెగ్గింది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకోగా... కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. క్రిస్‌లిన్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కలిస్ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉతప్ప (22), సూర్యకుమార్ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్ వరుణ్ ఆరోన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. టకవాలె (28 బంతుల్లో 40; 8 ఫోర్లు), కోహ్లి (23 బంతుల్లో 31; 4 ఫోర్లు), యువరాజ్ (34 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... ఆఖరి ఓవర్లో జరిగిన డ్రామాలో బెంగళూరు తేలిపోయింది. బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు... అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చిన లిన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తడబాటుతో మొదలై... గంభీర్, మనీష్ పాండే విఫలం కావడంతో కోల్‌కతా 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ కలిస్, క్రిస్‌లిన్ ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అయితే ఆరోన్ ఒకే ఓవర్లో లిన్‌తో పాటు యూసుఫ్ పఠాన్‌ను అవుట్ చేసి కోల్‌కతా జోరుకు బ్రేక్ వేశాడు. కలిస్ వేగం తగ్గించడం, ఉతప్ప ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కోల్‌కతా ఒత్తిడిలో పడింది. చివర్లో సూర్యకుమార్ ధాటిగా ఆడి నైట్‌రైడర్స్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఒత్తిడిలో చిత్తు 151 పరుగుల లక్ష్యఛేదనను బెంగళూరు జట్టు ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు టకవాలె, పార్థీవ్ చెలరేగి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే ఈ ఇద్దరూ అదే స్కోరు వద్ద అవుటయ్యారు. కోహ్లి, యువరాజ్ నిలకడగా ఆడటంతో బెంగళూరు 13వ ఓవర్లో వంద మార్కు చేరింది. బెంగళూరు లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో కోహ్లి అవుటయ్యాడు. 25 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో యువరాజ్ నెమ్మదిగా ఆడాడు. దీంతో ఒత్తిడి పెరిగింది. యువీ అవుటయ్యాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా... వినయ్ కుమార్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతికి డివిలియర్స్ దాదాపుగా సిక్సర్‌గా మలిచాడు. అయితే లిన్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ కోల్‌కతా ఖాతాలో చేరింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: కలిస్ (సి) టకవాలె (బి) చహల్ 43; గంభీర్ ఎల్.బి.డబ్ల్యు (బి) స్టార్క్ 0; మనీష్ పాండే (సి) కోహ్లి (బి) అల్బీ మోర్కెల్ 5; క్రిస్ లిన్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 45; యూసుఫ్ పఠాన్ (సి) కోహ్లి (బి) ఆరోన్ 0; ఉతప్ప (సి) స్టార్క్ (బి) ఆరోన్ 22; సూర్య కుమార్ నాటౌట్ 24; వినయ్ కుమార్ (సి) అల్బీ మోర్కెల్ (బి) స్టార్క్ 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు): 150 వికెట్ల పతనం: 1-1; 2-10; 3-90; 4-90; 5-107; 6-129; 7-150 బౌలింగ్: స్టార్క్ 4-0-33-2; అల్బీ మోర్కెల్ 2-0-21-1; వరుణ్ ఆరోన్ 4-0-16-3; మురళీధరన్ 2-0-25-0; చహల్ 4-0-26-1; దిండా 4-0-26-0 బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: పార్థివ్ పటేల్ (సి) లిన్ (బి) వినయ్ 21; టకవాలె ఎల్.బి.డబ్ల్యు (బి) కలిస్ 40; కోహ్లి (బి) నరైన్ 31; యువరాజ్ (సి) యూసుఫ్ పఠాన్ (బి) ఉమేశ్ యాదవ్ 31; డివిలియర్స్ (సి) లిన్ (బి) వినయ్ 11; అల్బీ మోర్కెల్ నాటౌట్ 6; స్టార్క్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు): 148 వికెట్ల పతనం: 1-67; 2-67; 3-122; 4-141; 5-145 బౌలింగ్: ఉమేశ్ 4-0-40-1; మోర్నీ మోర్కెల్ 4-0-34-0; నరైన్ 4-0-17-1; వినయ్ 4-0-26-2; కలిస్ 4-0-26-1. బెంగళూరు విజయ లక్ష్యం 6 బంతుల్లో 9 పరుగులు...క్రీజులో డివిలియర్స్, ఆల్బీ మోర్కెల్.... వినయ్ వేసిన తొలి మూడు బంతుల్లో మూడు పరుగులు...ఇక విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులు వినయ్ నాలుగో బంతి వేశాడు... డివిలియర్స్ బలంగా గాల్లోకి లేపాడు... బంతి వేగంగా బౌండరీ వైపు దూసుకుపోతోంది.... ఇక సిక్సరే... అనుకునే లోపు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు సాక్షాత్కరించని ఓ మెరుపు దృశ్యం కళ్ల ముందు తళుక్కుమంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న క్రిస్‌లిన్... బౌండరీ రోప్ దగ్గర చేసిన విన్యాసం... క్షణకాలం స్టేడియం మూగబోయేలా చేసింది. ....బంతి గాల్లో వేగంగా దూసుకొస్తోంది. తదేకంగా చూస్తూ పరుగెడుతున్న లిన్ స్లిప్ అయ్యాడు. కానీ రెప్పపాటులో ఒంటి కాలి మీద వెనక్కి లేస్తూ గాలిలో రోప్ మీదకు జంప్ చేశాడు. బౌండరీ దాటుతున్న బంతిని నేర్పుగా రెండు చేతుల్లో ఒడిసిపట్టాడు. అంతే వేగంతో శరీరాన్ని విల్లులా వంచుతూ... ముందుకు తీసుకొచ్చి రోప్‌ను తగలకుండా కుడి చేతి మీద బరువు వేస్తూ పక్షిలా నేలపైకి ల్యాండ్ అయ్యాడు... సీన్ కట్ చేస్తే... డివిలియర్స్ అవుట్... రెండు, మూడు సెకన్లలోనే ఈ మొత్తం సీన్ జరగడంతో స్టేడియంలోని ప్రతి ఒక్కరు ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి నిశ్చేష్టులైపోయారు. చివరి రెండు బంతులకు మూడు పరుగులే రావడంతో కోల్‌కతా అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకుంది.