క్రిస్‌లిన్ సంచలన క్యాచ్ తో నెగ్గిన కోల్‌కతా
ఉత్కంఠపోరులో బెంగళూరుకు నిరాశ
క్యాచ్‌లు మ్యాచ్‌ల్ని గెలిపిస్తాయంటారు... నిజమే... ఒక్క క్యాచ్ బెంగళూరు నోటి దగ్గర విజయాన్ని దూరం చేసింది. ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్‌లు చేసే విన్యాసాన్ని తలపిస్తూ క్రిస్‌లిన్ అందుకున్న సంచలన క్యాచ్‌తో... కోల్‌కతా ఖాతాలో అసాధారణ విజయం చేరింది. 19.3 ఓవర్ల పాటు బెంగ ళూరు చేతిలో ఉన్న మ్యాచ్‌ను ఒకే ఒక్క క్యాచ్‌తో ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్‌లిన్ కోల్‌కతా ఖాతాలో చేర్చాడు.
షార్జా: సులభంగా గెలవాల్సిన మ్యాచ్... చేతులో కావల్సినన్ని వికెట్లు... ఏ జట్టుకు లేనంత బలమైన బ్యాటింగ్ లైనప్... కానీ ఫలితం లేదు... టి20 ప్రపంచకప్ ఫైనల్‌ను తలపిస్తూ యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ బెంగళూరు కొంప ముంచింది. రెండు, మూడు ఓవర్లు మిగిలి ఉండగానే గెలవాల్సిన మ్యాచ్‌ను మాల్యా జట్టు చేజేతులా పొగొట్టుకుంది. తాము గెలుస్తామనే నమ్మకం ఏ కోశానా లేని కోల్‌కతా నైట్ రైడర్స్ బెంగళూరు చెత్త బ్యాటింగ్ కారణంగా అనూహ్యంగా విజయం సాధించింది.
గురువారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గంభీర్ సేన 2 పరుగుల తేడాతో కోహ్లి బృందంపై నెగ్గింది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకోగా... కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. క్రిస్‌లిన్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కలిస్ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉతప్ప (22), సూర్యకుమార్ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్ వరుణ్ ఆరోన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. టకవాలె (28 బంతుల్లో 40; 8 ఫోర్లు), కోహ్లి (23 బంతుల్లో 31; 4 ఫోర్లు), యువరాజ్ (34 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... ఆఖరి ఓవర్లో జరిగిన డ్రామాలో బెంగళూరు తేలిపోయింది. బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు... అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చిన లిన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
తడబాటుతో మొదలై...
గంభీర్, మనీష్ పాండే విఫలం కావడంతో కోల్‌కతా 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ కలిస్, క్రిస్‌లిన్ ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అయితే ఆరోన్ ఒకే ఓవర్లో లిన్‌తో పాటు యూసుఫ్ పఠాన్‌ను అవుట్ చేసి కోల్‌కతా జోరుకు బ్రేక్ వేశాడు. కలిస్ వేగం తగ్గించడం, ఉతప్ప ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కోల్‌కతా ఒత్తిడిలో పడింది. చివర్లో సూర్యకుమార్ ధాటిగా ఆడి నైట్‌రైడర్స్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
ఒత్తిడిలో చిత్తు
151 పరుగుల లక్ష్యఛేదనను బెంగళూరు జట్టు ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు టకవాలె, పార్థీవ్ చెలరేగి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే ఈ ఇద్దరూ అదే స్కోరు వద్ద అవుటయ్యారు. కోహ్లి, యువరాజ్ నిలకడగా ఆడటంతో బెంగళూరు 13వ ఓవర్లో వంద మార్కు చేరింది. బెంగళూరు లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో కోహ్లి అవుటయ్యాడు.
25 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో యువరాజ్ నెమ్మదిగా ఆడాడు. దీంతో ఒత్తిడి పెరిగింది. యువీ అవుటయ్యాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా... వినయ్ కుమార్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతికి డివిలియర్స్ దాదాపుగా సిక్సర్‌గా మలిచాడు. అయితే లిన్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ కోల్‌కతా ఖాతాలో చేరింది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: కలిస్ (సి) టకవాలె (బి) చహల్ 43; గంభీర్ ఎల్.బి.డబ్ల్యు (బి) స్టార్క్ 0; మనీష్ పాండే (సి) కోహ్లి (బి) అల్బీ మోర్కెల్ 5; క్రిస్ లిన్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 45; యూసుఫ్ పఠాన్ (సి) కోహ్లి (బి) ఆరోన్ 0; ఉతప్ప (సి) స్టార్క్ (బి) ఆరోన్ 22; సూర్య కుమార్ నాటౌట్ 24; వినయ్ కుమార్ (సి) అల్బీ మోర్కెల్ (బి) స్టార్క్ 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు): 150
వికెట్ల పతనం: 1-1; 2-10; 3-90; 4-90; 5-107; 6-129; 7-150
బౌలింగ్: స్టార్క్ 4-0-33-2; అల్బీ మోర్కెల్ 2-0-21-1; వరుణ్ ఆరోన్ 4-0-16-3; మురళీధరన్ 2-0-25-0; చహల్ 4-0-26-1; దిండా 4-0-26-0
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: పార్థివ్ పటేల్ (సి) లిన్ (బి) వినయ్ 21; టకవాలె ఎల్.బి.డబ్ల్యు (బి) కలిస్ 40; కోహ్లి (బి) నరైన్ 31; యువరాజ్ (సి) యూసుఫ్ పఠాన్ (బి) ఉమేశ్ యాదవ్ 31; డివిలియర్స్ (సి) లిన్ (బి) వినయ్ 11; అల్బీ మోర్కెల్ నాటౌట్ 6; స్టార్క్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు): 148
వికెట్ల పతనం: 1-67; 2-67; 3-122; 4-141; 5-145
బౌలింగ్: ఉమేశ్ 4-0-40-1; మోర్నీ మోర్కెల్ 4-0-34-0; నరైన్ 4-0-17-1; వినయ్ 4-0-26-2; కలిస్ 4-0-26-1.
బెంగళూరు విజయ లక్ష్యం 6 బంతుల్లో 9 పరుగులు...క్రీజులో డివిలియర్స్, ఆల్బీ మోర్కెల్....
వినయ్ వేసిన తొలి మూడు బంతుల్లో మూడు పరుగులు...ఇక విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులు వినయ్ నాలుగో బంతి వేశాడు... డివిలియర్స్ బలంగా గాల్లోకి లేపాడు... బంతి వేగంగా బౌండరీ వైపు దూసుకుపోతోంది.... ఇక సిక్సరే... అనుకునే లోపు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు సాక్షాత్కరించని ఓ మెరుపు దృశ్యం కళ్ల ముందు తళుక్కుమంది.
టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న క్రిస్‌లిన్... బౌండరీ రోప్ దగ్గర చేసిన విన్యాసం...
క్షణకాలం స్టేడియం మూగబోయేలా చేసింది. ....బంతి గాల్లో వేగంగా దూసుకొస్తోంది.
తదేకంగా చూస్తూ పరుగెడుతున్న లిన్ స్లిప్ అయ్యాడు. కానీ రెప్పపాటులో ఒంటి కాలి మీద వెనక్కి లేస్తూ గాలిలో రోప్ మీదకు జంప్ చేశాడు. బౌండరీ దాటుతున్న బంతిని నేర్పుగా రెండు చేతుల్లో ఒడిసిపట్టాడు.
అంతే వేగంతో శరీరాన్ని విల్లులా వంచుతూ... ముందుకు తీసుకొచ్చి రోప్‌ను తగలకుండా కుడి చేతి మీద బరువు వేస్తూ పక్షిలా నేలపైకి ల్యాండ్ అయ్యాడు... సీన్ కట్ చేస్తే... డివిలియర్స్ అవుట్... రెండు, మూడు సెకన్లలోనే ఈ మొత్తం సీన్ జరగడంతో స్టేడియంలోని ప్రతి ఒక్కరు ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి నిశ్చేష్టులైపోయారు. చివరి రెండు బంతులకు మూడు పరుగులే రావడంతో కోల్‌కతా అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకుంది.