‘సన్’కు చెన్నై స్ట్రోక్ | IPL 2014: Chennai Super Kings vs Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

‘సన్’కు చెన్నై స్ట్రోక్

Published Mon, Apr 28 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

‘సన్’కు చెన్నై స్ట్రోక్

‘సన్’కు చెన్నై స్ట్రోక్

సూపర్ కింగ్స్ మరో విజయం  
 5 వికెట్లతో హైదరాబాద్ ఓటమి   
 చెలరేగిన డ్వేన్ స్మిత్
 
 సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బలం, బలగం జోరు ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. జట్టు టాప్ ఆర్డర్ విఫలం కాగా... కనీస ప్రదర్శన ఇవ్వలేని పేలవమైన లైనప్‌తో ఆ జట్టు మరోసారి భంగపడింది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో పరాజయం తర్వాత చెన్నై సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోగా... సన్‌రైజర్స్ మూడో ఓటమిని మూటగట్టుకుంది.
 
 షార్జా: ఐపీఎల్‌లో జోరు మీదున్న ధోని సేన మరో గెలుపును సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడ షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
 
 
 ఆరోన్ ఫించ్ (45 బంతుల్లో 44; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోహిత్ శర్మ, హిల్ఫెన్హాస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అదనపు బౌలర్‌గా ఇషాంత్ శర్మను తీసుకోవడంతో హైదరాబాద్ బ్యాటింగ్ బలహీనంగా మారి తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం డ్వేన్ స్మిత్ (46 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (33 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా కీలకపాత్ర పోషించాడు.
 
 మెరుపులే లేవు...
 చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నెమ్మదిగా ఆరంభమైన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ వేగంగా సాగలేదు. హిల్ఫెన్హాస్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చి ధావన్ (7) వెనుదిరగ్గా... వార్నర్ (0) అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. లెగ్‌స్టంప్ బయట పడిన బంతి, వార్నర్ ప్యాడ్లపై చాలా ఎత్తులో తాకినా అంపైర్ అవుటిచ్చాడు.
 
 ఈ దశలో ఫించ్, రాహుల్ (27 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 37 పరుగులకు చేరింది. రాహుల్‌ను స్మిత్ అవుట్ చేయడంతో 52 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన వేణుగోపాలరావు (13) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.
 
 మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఫించ్ వెనుదిరిగాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సన్ స్కోరు 113 పరుగులు మాత్రమే. అయితే స్యామీ (15 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) భారీ షాట్లు ఆడి చివరి 2 ఓవర్లలో 32 పరుగులు రాబట్టారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 16 బంతుల్లో 36 పరుగులు జోడించారు.
 
  సూపర్ ఓపెనింగ్...
 వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నైకి ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో జట్టు పవర్ ప్లేలో 47 పరుగులు చేసింది. ముఖ్యంగా స్మిత్ భారీ షాట్లతో చెలరేగాడు. ఇషాంత్ తొలి ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లు కొట్టి ఊపు తెచ్చాడు. ఎట్టకేలకు కరణ్ శర్మ బౌలింగ్‌లో మెకల్లమ్ వెనుదిరిగడంతో 85 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది.
 
 మరోవైపు ఫామ్‌లో ఉన్న స్మిత్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రైనా (14) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ధాటిగా ఆడుతున్న స్మిత్‌తో పాటు డు ప్లెసిస్ (0)ను భువనేశ్వర్ ఒకే ఓవర్లో అవుట్ చేయగా, వెంటనే జడేజా (6) కూడా వెనుదిరగడంతో సన్ శిబిరంలో ఆశలు రేగాయి. అయితే ధోని (14 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్) నిలబడి మూడు బంతుల ముందే జట్టును గెలిపించాడు.
 
 స్కోరు వివరాలు
 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) మోహిత్ 44; ధావన్ (సి) మన్హాస్ (బి) హిల్ఫెన్హాస్ 7; వార్నర్ (ఎల్బీ) (బి) హిల్ఫెన్హాస్ 0; రాహుల్ (సి) పాండే (బి) స్మిత్ 25; వేణు (సి) స్మిత్ (బి) మోహిత్ 13; స్యామీ (నాటౌట్) 23; కరణ్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 145
 వికెట్ల పతనం: 1-15; 2-15; 3-67; 4-98; 5-109.
 బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-32-2; పాండే 3-0-22-0; మోహిత్ 4-0-27-2; అశ్విన్ 4-0-17-0; జడేజా 3-0-23-0; స్మిత్ 2-0-11-1.
 
 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 66; మెకల్లమ్ (బి) కరణ్ 40; రైనా (సి) వేణు (బి) ఇషాంత్ 14; ధోని (నాటౌట్) 13; డు ప్లెసిస్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0; జడేజా (బి) ఇషాంత్ 6; మన్హాస్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 146
 వికెట్ల పతనం: 1-85; 2-114; 3-126; 4-127; 5-138.
 బౌలింగ్: స్టెయిన్ 4-0-20-0; భువనేశ్వర్ 4-0-23-2; కరణ్ శర్మ 4-0-35-1; మిశ్రా 3.3-0-27-0; ఇషాంత్ 4-0-37-2.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement