ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ | Sameer Rizvi smashes 97-ball 201, slams 20 sixes in an innings | Sakshi
Sakshi News home page

ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ

Published Sun, Dec 22 2024 8:46 AM | Last Updated on Sun, Dec 22 2024 8:59 AM

Sameer Rizvi smashes 97-ball 201, slams 20 sixes in an innings

బీసీసీఐ పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌ కెప్టెన్‌ సమీర్‌ రిజ్వీ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శనివారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో సమీర్‌ రిజ్వీ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను రిజ్వీ ఊచకోత కోశాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.

రిజ్వీ కేవలం 97 బంతుల్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. సమీర్‌ రిజ్వీతో పాటు... శౌర్య సింగ్‌ (51; 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఆదర్శ్‌ సింగ్‌ (52) హాఫ్‌సెంచరీలతో రాణించారు.

అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన త్రిపుర జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 253 పరుగులకు పరిమితమైంది. ఆనంద్‌ (68), తన్మయ్‌ దాస్‌ (48) పోరాడినా లాభం లేకపోయింది. ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో కునాల్‌ త్యాగీ 3, విజయ్‌ కుమార్, వన్ష్‌ చౌదరి చెరో రెండు వికెట్లు తీశారు.

రిజ్వీ అరుదైన ఘనత..
కాగా ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో మెరిసిన సమీర్‌ రిజ్వీ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అండ‌ర్ 23 స్టేట్‌-ఎ ట్రోఫీ చ‌రిత్రలో ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ ఆటగాడిగా రిజ్వీ నిలిచాడు. అయితే ఈ టోర్నీలో రిజ్వీ చేసిన డబుల్‌ సెంచరీ లిస్ట్‌-ఎ క్రికెట్‌ కిందకి రాదు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉంది. కివీస్‌ దేశీవాళీ టోర్నీ ఫోర్డ్ ట్రోఫీలో బోవ్స్‌ కేవలం 103 బంతుల్లో ద్విశతకం సాధించాడు.

చెన్నై టూ ఢిల్లీ.. 
ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రిజ్వీని రూ. 95 లక్షలకకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు రిజ్వీ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌-2024 మినీ వేలంలో  చెన్నై సూప‌ర్ కింగ్స్ స‌మీర్ రిజ్వీని 8.4 కోట్ల‌ భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. సీఎస్‌కే దిగ్గజం ఎంఎస్‌ ధోనితో కలిసి ఆడాడు. అతడి సూచనలు మెరకు ఒకట్రెండు మ్యాచ్‌ల్లో పర్వాలేదన్పించిన రిజ్వీ.. తర్వాతి మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. ఐదు మ్యాచుల్లో కేవ‌లం 51 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement