అప్పుడు రూ. 10 కోట్లు.. ఇప్పుడు అన్‌సోల్డ్‌.. నా హృదయం ముక్కలైంది! | CSK Went For Everyone But: Aakash Chopra Surprised by Shardul Thakur Unsold | Sakshi
Sakshi News home page

‘సీఎస్‌కే అందరి కోసం ట్రై చేసింది.. అతడిని మాత్రం వదిలేసింది’

Published Tue, Nov 26 2024 3:27 PM | Last Updated on Tue, Nov 26 2024 4:58 PM

CSK Went For Everyone But: Aakash Chopra Surprised by Shardul Thakur Unsold

సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్‌ మెగా వేలం-2025 సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్‌ ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించాడు.

ఈసారి అతడు అన్‌సోల్డ్‌
అదే విధంగా శ్రేయస్‌ అయ్యర్‌(రూ. 26.75 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌), వెంకటేశ్‌ అయ్యర్(రూ. 23.75 కోట్లు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌) కూడా భారీ ధర పలికారు. అయితే, కొంతమంది టీమిండియా క్రికెటర్లను మాత్రం ఫ్రాంఛైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందులో పేస్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఒకడు. అతడు ఈసారి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ శార్దూల్‌ కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం తనను విస్మయపరిచిందన్నాడు. ‘‘లార్డ్‌ ఠాకూర్‌ పేరు రానేలేదు. క్రికెట్‌, క్రికెటేతర కారణాలు ఏవైనా కావచ్చు. అతడు రెండుసార్లు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు.

సీఎస్‌కే అందరి కోసం ట్రై చేసింది
తాము వదిలేసిన ఫాస్ట్‌ బౌలర్లలో శార్దూల్‌ మినహా అందరినీ.. తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రయత్నించింది. అతడిని మాత్రం వదిలేసింది. శార్దూల్‌ అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో 2020-21 భాగంగా గాబా టెస్టులో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత.. వేలంలో ఏకంగా రూ. 10 కోట్లు వచ్చాయి. 

కానీ.. ఈసారి రూ. 2 కోట్లకు అందుబాటులో ఉన్నా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. నిజంగా అతడి పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలైంది’’ అని ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. 

ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లు
కాగా 2015లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌.. ఈ ఏడాది చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, వేలానికి ముందు అతడిని వదిలేసిన సీఎస్‌కే.. వేలం సందర్భంగా మొత్తానికే గుడ్‌బై చెప్పింది. ఇక శార్దూల్‌ ఠాకూర్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లు ఆడి 307 రన్స్‌ చేయడంతో పాటు.. 94 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: వెంకటేశ్‌ అయ్యర్‌, నరైన్‌ కాదు.. కేకేఆర్‌ కెప్టెన్‌గా అతడే!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement