పారిస్: ఫార్ములావన్ (ఎఫ్1) క్యాలెండర్‌లో 65 ఏళ్లుగా నిర్విరామంగా జరుగుతోన్న విఖ్యాత వీధి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి రద్దయింది. ప్రస్తుతం కరోనా (కోవిడ్–19) యూరప్‌లో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మే 24న ఈ రేసు జరగాల్సి ఉంది. దాంతో ఈ ఏడాది ఎఫ్1 సీజన్‌లో రద్దయిన రెండో రేసుగా మొనాకో నిలిచింది. 1929లో ఎఫ్1 క్యాలెండర్‌లో అరంగేట్రం చేసిన ఈ రేసు చివరిసారిగా 1954లో జరగలేదు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (జీపి)తో గత వారమే ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ ఘనంగా ఆరంభమవ్వాల్సి ఉండగా ... కరోనా కారణంతో తొలి రేసును రద్దు చేశారు. అనంతరం ఈ ఆదివారం జరగాల్సిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, ఏప్రిల్‌లో జరగాల్సిన వియత్నాం, చైనీస్ రేసులను కూడా వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) నిర్ణయం తీసుకుంది. దాంతో 2020 సీజన్ మే 1న డచ్ గ్రాండ్‌ప్రితో ఆరంభమవుతుందని భావించారు. అయితే డచ్ గ్రాండ్‌ప్రి రేసును, మే 8న జరగాల్సిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసును కూడా వాయిదా వేస్తున్నట్లు రేసు నిర్వాహకులు తెలిపారు. దీంతో ప్రస్తుత సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎఫ్1 నిర్వాహకులు మాత్రం జూన్ 7న జరగాల్సిన అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రితో సీజన్ ఆరంభమవుతుందనే విశ్వాసంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment