సిడ్నీ, ఆస్ట్రేలియా : దక్షిణాఫ్రికా పర్యటన డిజాస్టర్‌గా మారిన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులోని మరింత మందిపై వేటు పడాలని, ముఖ్యంగా దేశ క్రికెట్ అధినాయకత్వం ఇందుకు బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ జట్టు 3-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన నాలుగో టెస్టులో 492 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చిత్తయింది. 1960 దశకం తర్వాత సఫారీ జట్టు ఆసీస్‌పై టెస్టు సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి.
కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఉదంతం వెలుగుచూడటం, ఈ వివాదంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం జట్టు కోచ్ డారెన్ లీమన్ కూడా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఈ సంక్షోభం ఇద్దరు లేదా ముగ్గురు దిగిపోవడం వల్ల సమసిపోదని పెద్దస్థాయిలోని వ్యక్తులు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సిందేనని వార్న్ అభిప్రాయపడ్డారు.
‘ఆస్ట్రేలియా జట్టు మరోసారి ప్రపంచ శక్తిగా ఎదగాలంటే సరైన వ్యక్తులు రంగంలోకి దిగాల్సిన అవసరముంది. ఇప్పుడు కొత్తవారికి ఆటతోపాటు క్రికెట్ నాయకత్వంలోనూ అవకాశాలు ఉన్నాయి. (బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో) అన్ని హోదాల్లో ఉన్నవారు ప్రమాదంలో పడ్డారు. పెద్ద తలకాయలు దిగిపోవాల్సింది’ అని షేన్ వార్న్ విశ్లేషించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ఓటమి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్‌లాండ్, టీమ్ మేనేజర్ ప్యాట్ హోవార్డ్ తమ పదవుల నుంచి దిగిపోవాల్సిందేనని పరోక్షంగా వార్న్ పేర్కొన్నట్టు ఫాక్స్ స్పోర్ట్స్ తెలిపింది. కోచ్‌తోపాటు బ్యాటింగ్ కోచ్‌లు కూడా బాధ్యత వహించాలని, ఇంకెప్పుడు ఒక మంచి బ్యాట్స్‌మన్‌ను జట్టుకు అందిస్తారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment