
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో బాలీవుడ్ నటులతోనే క్రీడలు ప్రాచుర్యం పొందాయన్న వాదనను ఒప్పుకోనని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేశారు. నగరంలో జరగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం ‘క్రీడా రంగంలో వ్యాపార విజయం’ అంశంపై మాస్టర్‌క్లాస్ సెషన్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి సమన్వయకర్తగా హర్షబోగ్లే వ్యవహరించగా.. టెన్నిస్ స్టార్ సానియ మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, వన్ చాంపియన్‌షిప్ ఉపాధ్యక్షులు చాత్రి సిత్యోంద్టాంగ్‌లు పాల్గొన్నారు.
బాలీవుడ్ నటుల ప్రచారంతో క్రీడలు ప్రాచుర్యం పొందాయన్న వాదనను సానియా మీర్జా తప్పుబట్టారు. క్రీడాకారులు రాణించడం వల్లనే ఆదరణ లభిస్తోందని స్పష్టంచేశారు. క్రీడల్లో మహిళలు కూడా రాణిస్తున్నారని, టెన్నిస్ క్రికెట్ లాంటి క్రీడల్లో మహిళలను మరింత ప్రోత్సాహించాలన్నారు. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని, పట్టుదల, కృషి ఎంతో అవసరమన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని, కొత్త క్రీడాకారులకు ప్రోత్సాహకం అందజేయాలని సానియా సూచించారు.
ఆర్థికంగా బాగా ఉన్నవారే క్రీడలవైపు వస్తున్నారని, చాలా మంది గ్రామీణ క్రీడాకారులు వసతులు, ఆర్థిక లేమితో అక్కడే ఉండిపోతున్నారని మిథాలీ రాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి క్రీడా నైపుణ్యాలున్న వారున్నారని వారందరికీ చేయుతనివ్వాలని మిథాలీ సూచించారు.
దేశ ప్రజలు క్రికెట్ నుంచి అన్ని క్రీడలవైపు మొగ్గు చూపుతున్నారని కోచ్ గోపిచంద్ అభిప్రాయపడ్డారు. టెన్నిస్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ ఇలా అన్ని క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారని, ముఖ్యంగా క్రీడల్లోకి రావడానికి మహిళలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. బ్యాడ్మింటన్‌లో క్రీడాకారులు బాగా రాణిస్తున్నారు. క్రీడాకారుడి నుంచి కామెంటేటర్ వరకు క్రీడారంగంలో చాలా అవకాశాలున్నాయని గోపిచంద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment