వన్డే కెప్టెన్ గా సరికొత్త రికార్డు..
ఆంటిగ్వా: ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సరికొత్త రికార్డు సాధించాడు. శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో మోర్గాన్ సెంచరీ సాధించి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మోర్గాన్ సెంచరీ నమోదు చేయడం ద్వారా అతని పేరిట కొత్త రికార్డు లిఖించబడింది. ఇంగ్లండ్ తరపున వన్డే కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సాధించాడు. ఇది కెప్టెన్ గా మోర్గాన్ కు ఐదో సెంచరీ. తద్వారా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఆండ్రూ స్ట్టాస్, అలెస్టర్ కుక్లు రికార్డును మోర్గాన్ అధిగమించాడు. అంతకుముందు స్ట్రాస్, కుక్లు కెప్టెన్గా నాలుగు సెంచరీలు మాత్రమే సాధించగా, దాన్ని మోర్గాన్ సవరించాడు.
వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. మోర్గాన్(107) సెంచరీకి తోడు బిల్లింగ్స్(52), బెన్ స్టోక్స్(55)లు రాణించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఆ తరువాత విండీస్ 47.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. జాసన్ మొహ్మద్(72),కార్టర్(52)లు మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించడంతో విండీస్ కు పరాజయం తప్పలేదు.