
డబ్లిన్: వర్షం వల్ల కుదించిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గర్జించింది. ఛేదనలో విజృంభించింది. 24 ఓవర్లలో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతిలో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. బంగ్లాదేశ్ కెరీర్‌లోనే తొలి ముక్కోణపు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు హోప్ (74; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంబ్రిస్ (69 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు 144 పరుగులు జోడించారు. విండీస్ స్కోరు 20.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 131 పరుగులతో ఉన్నపుడు వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గాక మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించారు.
దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 24 ఓవర్లలో 210 పరుగులుగా నిర్ణయించారు. సుమారు ఓవర్‌కు 9 పరుగులు చేయాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (41 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. తర్వాత క్రీజులోకి దిగిన ముష్ఫికర్ రహీమ్ (36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథున్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నంత సేపు వేగంగా ఆడారు. అనంతరం మహ్ముదుల్లా (19 నాటౌట్) అండతో మొసద్దిక్ హొస్సేన్ (24 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. 20 బంతుల్లో మెరుపు అర్ధసెంచరీ సాధించడంతో బంగ్లా 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి జయభేరి మోగించింది.
Comments
Please login to add a commentAdd a comment