'ధోని ఎంపికను అలా చూడొద్దు'
న్యూఢిల్లీ:శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ కు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఎంపికచేయడాన్ని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సమర్ధించుకున్నాడు. అతని ఎంపికలో ఎటువంటి తప్పుజరగలేదనే అంతా తెలుసుకోవాలన్నాడు. ధోనిని ఆటోమేటిక్ ఛాయిస్ గా ఎంపిక చేశారంటూ కొందరు విమర్శించడంతో ఎంఎస్కే ఘాటుగా స్పందించాడు.
'ధోని ఎంపిక ఆటోమేటిక్ ఛాయిస్ కాదు. 2019 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకునే మా సెలక్షన్ జరిగింది. ధోనిని ఎంచుకునే విషయంలో టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ ఆగస్సీ గణాంకాలపై చర్చించాం. ఆగస్సీ కెరీర్ 30 ఏళ్ల దాటిన తరువాత ప్రారంభమైంది. అతని కెరీర్ చివరి దశలో ఎన్నో టైటిల్స్ గెలిచి స్ఫూర్తివంతంగా నిలిచాడు. ప్రస్తుతం ధోనిని ఆటోమేటిక్ ఛాయిస్ గా ఎంపిక చేయలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అతని ఎంపిక జరిగింది. రాబోవు మ్యాచ్ ల్లో అతను ఎలా ఆడతాడో చూడండి. ఇక రిషబ్ పంత్ కు ట్వంటీ 20ల్లో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. హార్దిక్ పాండ్యాను కూడా ఇలానే తొలుత ఎంపిక చేశాం. రిషబ్ పంత్ విషయంలో అలానే జరుగుతుంది.అంతేకానీ ధోని ఎంపికను తప్పుపట్టడం సరికాదు'అని ఎంఎస్కే అన్నాడు.