చాయ్‌వాలాను కలిసిన ధోనీ.. ఏం చేశాడో తెలుసా?
చాయ్‌వాలాను కలిసిన ధోనీ.. ఏం చేశాడో తెలుసా?
Published Sat, Mar 4 2017 8:55 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ తన మూలాలను మర్చిపోడు. ఒకప్పుడు తాను కష్టపడిన రోజులను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ధోనీ ఆగ్నేయ రైల్వేలో టీసీగా చేరి పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్ స్టేషన్‌లో పనిచేసిన సంగతి తెలిసిందే. ఖరగ్‌పూర్ రైల్వే ప్లాట్‌ఫాం మీద ఒక టీ కొట్టు ఉండేది. అందులో రోజూ రెండు మూడు సార్లు ధోనీ టీ తాగేవాడు. దాని యజమాని థామస్ అంటే అతడికి ఎంతో అభిమానం. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్న జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ధోనీ.. ఆ మ్యాచ్‌లలో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లాడు.
ఆ మ్యాచ్ చూసేందుకు చాయ్‌వాలా థామస్ కూడా వచ్చారు. ఆయనను వెంటనే గుర్తుపట్టిన ధోనీ.. తమ జట్టు బస చేసిన హోటల్లో డిన్నర్‌కు ఆహ్వానించాడు. దీన్ని కలలో కూడా ఊహించని థామస్.. ధోనీ ఆతిథ్యానికి ఎంతగానో సంబరపడిపోయాడు. అంతేకాదు, ఖరగ్‌పూర్ స్టేషన్‌లోని తన టీ స్టాల్‌కు 'ధోనీ టీస్టాల్' అని పేరు కూడా పెడతానని చెప్పాడు. జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ.. తన జట్టు సభ్యులతో పాటే రైల్లో ప్రయాణిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో కూడా పోస్ట్ చేశాడు.
Advertisement
Advertisement