kharagpur railway station
-
9, 11న పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఖరగ్‌పూర్ డివిజన్లోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద జరుగుతోన్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. హౌరా–మైసూర్ (22817), షాలీమార్–హైదరాబాద్(18045/18046), సత్రగచ్చి–చెన్నై సెంట్రల్ (22807), హౌరా–చెన్నై సెంట్రల్ (12839), ఆగర్తలా–సికింద్రాబాద్ (07029), సిల్ఘాట్ టౌన్–తంబరం (15630), చెన్నై సెంట్రల్–షాలీమార్ (12842), పురులియా–విల్లుపురం (22605) రైళ్లను ఈ నెల 9న రద్దు చేశారు. మైసూర్–హౌరా (22818) రైలును ఈ నెల 11న రద్దు చేశారు. -
చాయ్‌వాలాను కలిసిన ధోనీ.. ఏం చేశాడో తెలుసా?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ తన మూలాలను మర్చిపోడు. ఒకప్పుడు తాను కష్టపడిన రోజులను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ధోనీ ఆగ్నేయ రైల్వేలో టీసీగా చేరి పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ స్టేషన్లో పనిచేసిన సంగతి తెలిసిందే. ఖరగ్‌పూర్ రైల్వే ప్లాట్‌ఫాం మీద ఒక టీ కొట్టు ఉండేది. అందులో రోజూ రెండు మూడు సార్లు ధోనీ టీ తాగేవాడు. దాని యజమాని థామస్ అంటే అతడికి ఎంతో అభిమానం. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్న జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ధోనీ.. ఆ మ్యాచ్‌లలో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లాడు. ఆ మ్యాచ్ చూసేందుకు చాయ్‌వాలా థామస్ కూడా వచ్చారు. ఆయనను వెంటనే గుర్తుపట్టిన ధోనీ.. తమ జట్టు బస చేసిన హోటల్లో డిన్నర్‌కు ఆహ్వానించాడు. దీన్ని కలలో కూడా ఊహించని థామస్.. ధోనీ ఆతిథ్యానికి ఎంతగానో సంబరపడిపోయాడు. అంతేకాదు, ఖరగ్‌పూర్ స్టేషన్‌లోని తన టీ స్టాల్‌కు 'ధోనీ టీస్టాల్' అని పేరు కూడా పెడతానని చెప్పాడు. జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ.. తన జట్టు సభ్యులతో పాటే రైల్లో ప్రయాణిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంటులో కూడా పోస్ట్ చేశాడు. -
మమ్మల్ని తీవ్రవాదుల్లా చూశారు!
* 2007 వరల్డ్ కప్ వైఫల్యంపై ధోని * తన సినిమా వాస్తవంలా ఉంటుందన్న కెప్టెన్ న్యూయార్క్: వెస్టిండీస్‌లో జరిగిన 2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘోర ఓటమి తర్వాత స్వదేశంలో కనిపించిన స్పందన తన ఆలోచనా ధోరణిని మార్చిందని భారత వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. దాని ప్రభావం తనపై చాలా ఉందని, తనను తాను తీర్చిదిద్దుకోవడానికి అది కారణమైందని అతను గుర్తు చేసుకున్నాడు. ‘మేం టోర్నీ నుంచి నిష్కమ్రించిన తర్వాత నా ఇంటిపై రాళ్లు పడ్డాయి. ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ వ్యాన్‌లో వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో వివిధ టీవీ చానళ్లు తమ కెమెరాలతో మమ్మల్ని వెంబడించాయి. పరిస్థితి చూస్తే మేం హంతకులుగానో, తీవ్రవాదులుగానో కనిపించాము. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్లాం. ఆ ఘటన మానసికంగా నన్ను మరింత దృఢంగా మార్చింది’ అని ధోని చెప్పాడు. తన జీవిత విశేషాలతో తీస్తున్న ‘ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోని ఇక్కడ మీడియాతో ముచ్చటించాడు. ధోని పాత్ర పోషిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, నిర్మాత అరుణ్ పాండే కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో టీటీగా పని చేసిన నాటినుంచి 2011 వరల్డ్ కప్ ఫైనల్ వరకు పలు అంశాలు ఇందులో ఉంటాయని ధోని చెప్పాడు. ‘నన్ను అదే పనిగా కీర్తించడం ఈ సినిమాలో ఉండదు. ఇదే విషయాన్ని దర్శకుడికి స్పష్టంగా చెప్పాను. ఇది ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడి ప్రయాణంలాంటిది. ఈ స్థాయికి చేరడంలో ఎదురైన సవాళ్లు, బయటి ప్రపంచానికి తెలియని అంశాలు నా కోణంలో సినిమాలో కనిపిస్తాయి’ అని ధోని చెప్పాడు. సాధారణంగా తాను గతం గురించి ఎప్పుడూ పట్టించుకోనని, అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు అనేక జ్ఞాపకాలు మదిలో మెదిలాయంటూ ఉద్వేగానికి లోనైన ధోని... తన జీవిత చరిత్రను పుస్తకం రూపంలో తీసుకురావడానికి మరింత సమయం పడుతుందని స్పష్టం చేశాడు.