మమ్మల్ని తీవ్రవాదుల్లా చూశారు!
* 2007 వరల్డ్ కప్ వైఫల్యంపై ధోని
* తన సినిమా వాస్తవంలా ఉంటుందన్న కెప్టెన్
న్యూయార్క్: వెస్టిండీస్‌లో జరిగిన 2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘోర ఓటమి తర్వాత స్వదేశంలో కనిపించిన స్పందన తన ఆలోచనా ధోరణిని మార్చిందని భారత వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. దాని ప్రభావం తనపై చాలా ఉందని, తనను తాను తీర్చిదిద్దుకోవడానికి అది కారణమైందని అతను గుర్తు చేసుకున్నాడు. ‘మేం టోర్నీ నుంచి నిష్కమ్రించిన తర్వాత నా ఇంటిపై రాళ్లు పడ్డాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి పోలీస్ వ్యాన్‌లో వెళ్లాల్సి వచ్చింది.
ఆ సమయంలో వివిధ టీవీ చానళ్లు తమ కెమెరాలతో మమ్మల్ని వెంబడించాయి. పరిస్థితి చూస్తే మేం హంతకులుగానో, తీవ్రవాదులుగానో కనిపించాము. పోలీస్ స్టేషన్‌లో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్లాం. ఆ ఘటన మానసికంగా నన్ను మరింత దృఢంగా మార్చింది’ అని ధోని చెప్పాడు. తన జీవిత విశేషాలతో తీస్తున్న ‘ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోని ఇక్కడ మీడియాతో ముచ్చటించాడు. ధోని పాత్ర పోషిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, నిర్మాత అరుణ్ పాండే కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది.
ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో టీటీగా పని చేసిన నాటినుంచి 2011 వరల్డ్ కప్ ఫైనల్ వరకు పలు అంశాలు ఇందులో ఉంటాయని ధోని చెప్పాడు. ‘నన్ను అదే పనిగా కీర్తించడం ఈ సినిమాలో ఉండదు. ఇదే విషయాన్ని దర్శకుడికి స్పష్టంగా చెప్పాను. ఇది ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడి ప్రయాణంలాంటిది. ఈ స్థాయికి చేరడంలో ఎదురైన సవాళ్లు, బయటి ప్రపంచానికి తెలియని అంశాలు నా కోణంలో సినిమాలో కనిపిస్తాయి’ అని ధోని చెప్పాడు. సాధారణంగా తాను గతం గురించి ఎప్పుడూ పట్టించుకోనని, అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు అనేక జ్ఞాపకాలు మదిలో మెదిలాయంటూ ఉద్వేగానికి లోనైన ధోని... తన జీవిత చరిత్రను పుస్తకం రూపంలో తీసుకురావడానికి మరింత సమయం పడుతుందని స్పష్టం చేశాడు.