ఓపెనర్ జేసన్ రాయ్ కుడి చేతి గ్లోవ్‌ను తాకిన బంతి
బర్మింగ్‌హామ్ : డీఆర్‌ఎస్ విషయంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ విఫలమయ్యాడు. డీఆర్‌ఎస్ అంటేనే ధోని రివ్యూ సిస్టమ్‌గా మార్చుకున్న ఈ సీనియర్ క్రికెటర్.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రివ్యూను ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా వేసిన 11వ ఓవర్ ఐదో బంతి ఓపెనర్ జేసన్ రాయ్ కుడి చేతి గ్లోవ్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. వెంటనే భారత ఆటగాళ్లు అప్పీల్ చేసినా అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. కోహ్లి, హార్దిక్ క్యాచ్‌గా భావించినప్పటికి ధోని నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో భారత కెప్టెన్ రివ్యూ కోరే సాహసం చేయలేదు. కానీ అనంతరం రిప్లేలో బంతికి రాయ్ గ్లోవ్‌ను తాకినట్లు స్నికోలో కనిపించిన స్పైక్ ద్వారా స్పష్టమైంది. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 49 కాగా.. జేసన్ రాయ్ 20 పరుగులే చేశాడు. ఈ రివ్యూను భారత్ కనుక కోరి ఉంటే రాయ్ ఔటయ్యేవాడు.. తొలి వికెట్‌కు నమోదైన 160 పరుగుల భారీ భాగస్వామ్యానికి 49 పరుగులకే ముగింపు పడి ఇంగ్లండ్‌పై ఒత్తిడి నెలకొనేది. ఈ అవకాశంతో రెచ్చిపోయిన జాసన్ రాయ్ 57 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్‌లతో 66 పరుగులు చేసి 337 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఇదే ప్రస్తావిస్తూ అభిమానులు ధోనిపై మండిపడుతున్నారు.
ఇక డీఆర్‌ఎస్ అంచనా విషయంలో కొన్ని సార్లు లెక్క తప్పడం సహజమేనని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘స్పష్టత లేనప్పుడు డీఆర్‌ఎస్ అనేది చాలా క్లిష్టమైనది. జాసన్‌రాయ్ విషయంలో కూడా బాల్ తాకినట్లు కొంతమందికి వినబడింది. మరికొంతమందికి వినబడలేదు. దీంతో మా కెప్టెన్ ఒత్తిడికి లోనయ్యాడు. ఇక డీఆర్‌ఎస్ విషయంలో ధోని అంచనాలు ఎప్పుడూ ఫలితాన్నిచ్చాయి. దీంతో కోహ్లి ధోని నిర్ణయంవైపు మొగ్గు చూపాడు. అయితే జేసన్ రాయ్ ఔట్ విషయంలో సర్కిల్ లోపల ఉన్న ఫీల్డర్లే భిన్న వాదనలు వినిపించడంతో కోహ్లి వెనకడుగు వేసాడు. ఇక డీఆర్‌ఎస్ విషయంలో అదృష్టం ఉంటేనే ఫలితం వస్తుందనేది నా అభిప్రాయం. బంతి పిచ్ అయిన విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా బౌలర్లు రివ్యూ తీసుకుంటామని అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఈ సందర్భంలో కెప్టెన్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అదృష్టం ఉంటే ఫలితం అనుకూలంగా ఉంటుంది. లేకుంటే ప్రతికూలంగా ఉంటుంది. అయితే డీఆర్‌ఎస్‌ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment