
జార్ఖండ్ జట్టుతో ధోని ప్రాక్టీస్!
నాగ్పూర్: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తరువాత ఇంటికే పరిమితమైన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుత జార్ఖండ్ జట్టులో అనధికార సభ్యునిగా ఉన్న ధోని.. సెమీ ఫైనల్లో పాల్గొని దాన్ని ప్రాక్టీస్ ఉపయోగించుకోవాలని యోచిస్తున్నాడు. ఈ మేరకు ఆదివారం నుంచి గుజరాత్ తో జరిగే సెమీ ఫైనల్లో జార్ఖండ్ జట్టులో ధోని కలిసే అవకాశం ఉంది.
తన టెస్టు కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత ఎటువంటి లాంగర్ ఫార్మాట్లో ధోని పాల్గొనడం లేదు. అయితే త్వరలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ నేపథ్యంలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ప్రాక్టీస్ చేసిన తరువాత బరిలోకి దిగాలని ధోని భావిస్తున్నాడు. ఈ రంజీ సీజన్లో జార్ఖండ్ సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్ 29న విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తను చివరిసారిగా ఆడాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో కనీసం ముందుగా కొంతవరకూ ప్రాక్టీస్ చేసి బరిలోకి దిగాలనేది ధోని యోచన.