
సఫారీ సవాల్‌కు సిద్ధం
ముంబై: దక్షిణాఫ్రికాలో టెస్టు క్రికెట్ ఆడటం తమకు పెద్ద సవాల్ అని, అయితే దీనికి తాము సిద్ధంగా ఉన్నామని భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని అన్నాడు. సచిన్ టెండూల్కర్ అనుభవాన్ని తాము ఈ పర్యటనలో కోల్పోతున్నట్లు చెప్పాడు. అయితే ఈ పర్యటనలో ముందు వన్డేలు ఆడటం వల్ల జట్టుకు లాభమని ధోని అన్నాడు. వన్డేల్లో కుర్రాళ్లకు అనుభవం ఉన్నందున పరిస్థితులకు అలవాటు పడి, ఆ తర్వాత టెస్టులు ఆడతారని చెప్పాడు. ఆదివారం రాత్రి భారత జట్టు దక్షిణాఫ్రికా బయల్దేరింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే 5న జరుగుతుంది. జట్టు బయల్దేరడానికి ముందు ధోని చెప్పిన విశేషాలు అతడి మాటల్లోనే...
చాలా అనుభవం ఉంది: షార్ట్ ఫార్మాట్‌లో మా బ్యాట్స్‌మెన్‌కు చాలా అనుభవం ఉంది. కాబట్టి ముందుగా వన్డేలు ఆడటం వల్ల టెస్టులకు అవసరమైన ఆత్మ విశ్వాసం లభిస్తుంది. అయితే వన్డేల్లో ఎంత అనుభవం ఉన్నా బయటి దేశాల్లో ఆడటం ప్రతి ఒక్కరికీ సవాలుగా మారుతోంది. అలాగే కొత్త విషయాలను నేర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వికెట్‌కు తగ్గట్టుగా బంతి లెంగ్త్‌ను, బౌన్స్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. వన్డేలతో టూర్ మొదలుకావడం వల్ల బ్యాట్స్‌మెన్ మంచి షాట్లు ఆడటానికి అవకాశం వస్తుంది. టెస్టుల్లోనూ దీన్ని కొనసాగించొచ్చు.
నంబర్-4 నిర్ణయం కాలేదు: టెస్టుల్లో సచిన్ స్థానంలో బ్యాటింగ్‌కు ఎవరొస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒకరి స్థానాన్ని మరొకరు పూర్తిగా భర్తీ చేయలేరు. కాబట్టి వీలైనంతగా మిగతా స్థానాల్లో మెరుగైన బ్యాటింగ్ ఉండేలా చూస్తాం. వన్డేల్లో స్లాగ్ ఓవర్లలో మా బౌలింగ్ బాగుంటుందని ఆశిస్తున్నా.
పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు ప్రణాళికలు కూడా భిన్నంగా ఉంటాయి. పేసర్లకు పేస్, బౌన్స్ కావాలి. యార్కర్లు వేయడంతో పాటు కొద్దిపాటి పేస్‌తో బౌన్స్ రాబట్టాలి. కాబట్టి వికెట్ మీద ఇవి ఎలా లభిస్తాయో చూడాలి. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఈ విషయంలో మేం కాస్త మెరుగుపడ్డాం. దీన్ని మరింతగా మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకని చివరి 10 ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయాలి.
ఒత్తిడి కొత్తకాదు: ఒత్తిడిని ఎదుర్కోవడం భారత్‌కు కొత్త కాదు. భారత్‌లో ఆడినా, బయట ఆడినా ఒత్తిడి చేతులు మారుతుందే తప్ప తగ్గదు. రెండు ప్రపంచస్థాయి అగ్రశ్రేణి జట్లు పోటీపడుతున్నాయి కాబట్టి అభిమానులు నాణ్యమైన క్రికెట్‌ను చూసే అవకాశం ఉంటుంది. ర్యాంకింగ్స్‌లో రెండు జట్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. సిరీస్ రసవత్తరంగా జరగడం ఖాయం. అయితే వీలైనంత త్వరగా వాతావరణ పరి స్థితులకు అలవాటు పడటమే చాలా కీలకం. ప్రొటీస్ జట్టు మంచి ఆల్‌రౌండర్లతో సమతుల్యంగా ఉంది.
ఐదో బౌలర్ గురించి: బ్యాటింగ్ లైనప్ బలోపేతం అయిన తర్వాత ఐదో బౌలర్ గురించి ఆలోచిస్తాం. ప్రత్యర్థిని అవుట్ చేయాలంటే నలుగురు బౌలర్లు సరిపోతారు. మేం ఆడిన చివరి టెస్టులోనూ నలుగురు బౌలర్లతోనే ఆడాం. రోహిత్ ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కాబట్టి ఐదుగురు బ్యాట్స్‌మెన్ సరిపోరు. చివరి రెండు టెస్టుల్లో ఆరో బ్యాట్స్‌మన్ మ్యాచ్‌పై చాలా ప్రభావం చూపాడు. కాబట్టి బాగా పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం.
అశ్విన్ రాణిస్తాడు: విదేశాల్లో టెస్టులు తక్కువగా ఆడినా... స్పిన్నర్ అశ్విన్ రాణిస్తాడనే నమ్మకం ఉంది. స్వదేశంలో విశేషంగా రాణించే అతను విదేశాల్లోనూ దాన్ని కొనసాగిస్తాడు. బయట కూడా భారత్‌కు బాగా ఉపయోగపడతాడని భావిస్తున్నాం. ఇషాంత్‌ను తుది జట్టులో ఆడించడం, ఆడించకపోవడం అనేది కూడా రహస్యమే.
‘ఎప్పుడూ ప్రారంభం అనేది కొత్తగానే ఉంటుంది. పాజీ (సచిన్) తొలి టెస్టు ఆడినప్పుడు అది తనకి మొదటి టెస్టు అనే గుర్తుంచుకోవాలి. అలాగే ప్రతి అంశానికీ ఓ కొత్త ప్రారంభం ఉంటుంది. సచిన్ లేకుండా తొలిసారి దక్షిణాఫ్రికా వెళుతున్నాం. తన స్థానాన్ని భర్తీ చేయలేకపోయినా... ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకుంటారనే అనుకుంటున్నాను’
మూడో ఓపెనర్ గంభీరే!
మీడియాతో వివిధ అంశాలపై తెలివిగా మాట్లాడిన ధోని.. మూడో ఓపెనర్ విషయంలో మాత్రం తప్పులో కాలేశాడు. టెస్టుల్లో మూడో ఓపెనర్‌గా ఎవరు ఉంటారన్న ప్రశ్నకు స్పందించిన కెప్టెన్ ఠక్కున గంభీర్ అని సమాధానమిచ్చాడు.
ఇప్పటి వరకు ఓపెనర్లుగా ధావన్, విజయ్‌లు మెరుగ్గా ఆడుతున్నారు కాబట్టి మూడో ఓపెనర్‌గా కచ్చితంగా గౌతీనే పరిగణనలోకి తీసుకుంటామని కచ్చితంగా చెప్పేశాడు. దీంతో టెస్టు జట్టులో చోటు దక్కని గంభీర్ పేరు విని అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన కెప్టెన్... గౌతీ జట్టులో లేకపోయినా అతనే మూడో ఓపెనర్ అని క్లారిటీ ఇచ్చాడు. అంటే తన ప్రణాళికల్లో గంభీర్ కూడా ఓ భాగమని ధోని చెప్పకనే చెప్పాడు.