ముకుంద్‌కు మళ్లీ పిలుపు
పార్థివ్ స్థానంలో సాహా
బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఐదున్నరేళ్ల క్రితం భారత్ తరఫున తన చివరి టెస్టు ఆడిన తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌కు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది. బంగ్లాదేశ్‌తో ఈనెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్‌లో జరిగే ఏకైక టెస్టు కోసం మంగళవారం ప్రకటించిన భారత జట్టులో ముకుంద్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్ కోసం సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ముకుంద్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. 2016–17 రంజీ సీజన్‌లో 4 సెంచరీలు సహా 849 పరుగులు చేసి అతను సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. విజయ్, లోకేశ్ రాహుల్ రూపంలో ప్రధాన ఓపెనర్లు కూడా జట్టులో ఉండటంతో ముకుంద్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నా... 27 ఏళ్ల వయసులో అతను జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. మరోవైపు ఊహించినట్లుగానే రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టులోకి తిరిగి వచ్చాడు.
ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల తర్వాత గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. సాహా స్థానంలో వచ్చిన పార్థివ్ పటేల్ మిగిలిన మూడు టెస్టుల్లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పినట్లు సాహాకే మొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఇరానీ కప్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ చెలరేగి సాహా డబుల్ సెంచరీ కూడా చేయడం అతనికి కలిసొచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జట్టుతో పాటే ఉన్నా, మ్యాచ్ ఆడే అవకాశం దక్కని మనీశ్ పాండేని కూడా తప్పించారు. గాయాల నుంచి కోలుకున్న విజయ్, రహానే, జయంత్, హార్దిక్ పాండ్యాలను కూడా టెస్టు జట్టులోకి ఎంపిక చేయగా, ఇంకా కోలుకొని షమీ పేరును పరిశీలించలేదు.
భారత జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, కరుణ్ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, ఇషాంత్, భువనేశ్వర్, మిశ్రా, ముకుంద్, పాండ్యా.
‘ఎ’ జట్టులో సిరాజ్, రాహుల్
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఈనెల 16 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా జట్టు ముంబైలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో తలపడే భారత్ ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. హైదరాబాద్ పేసర్ సిరాజ్, హైదరాబాద్‌కే చెందిన సర్వీసెస్ బ్యాట్స్‌మన్ రాహుల్ సింగ్‌లకు స్థానం లభించింది.
జట్టు వివరాలు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అఖిల్, ప్రియాంక్, శ్రేయస్, అంకిత్ బావ్నే, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, నదీమ్, గౌతమ్, కుల్దీప్ యాదవ్, నవదీప్, దిండా, సిరాజ్, రాహుల్ సింగ్, ఇంద్రజిత్.
ఆరు గంటలు ఆలస్యంగా...
భారత జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా హైడ్రామా నడిచింది. సుప్రీం కోర్టు కొత్తగా నియమించిన కమిటీ ఈ ప్రక్రియను సరైన పద్ధతిలో నిర్వహించాలని పట్టుదల కనబర్చడమే దానికి కారణం. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్వీనర్ హోదాలో ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయత్నించగా పరిపాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ అందుకు అనుమతించలేదు. అమితాబ్‌కు అర్హత లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సమావేశం ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తనకు తెలీదంటూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూడా సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్ హోటల్ బయట తచ్చాడుతూ కనిపించారు. చివరకు సాయంత్రం ఆరు గంటలకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్లి ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. బీసీసీఐలో ఈ తరహా గందరగోళానికి త్వరలోనే తెర పడితే బాగుంటుందని, ప్రతీ రోజూ చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిగా మారాయని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డారు.