ఎవరు గెలిచినా చరిత్రే
42వ టైటిల్‌పై ముంబై దృష్టి
తొలిసారి నెగ్గేందుకు గుజరాత్ ఆరాటం
నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్
ఇండోర్: ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడు దశాబ్దాల ఎదురుచూపుల అనంతరం గుజరాత్ జట్టుకు అపూర్వ అవకాశం దక్కింది. తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటిదాకా ఆ జట్టు చాంపియన్‌గా నిలి చింది లేదు. అయితే ఈసారి మాత్రం విజేతగా నిలిచే అవకాశం వారి ముంగిట నిలి చింది. నేటి (మంగళవారం) నుంచి రంజీ రారాజు ముంబై జట్టుతో జరిగే తుది సమరంలో పార్థివ్ పటేల్ బృందం అమీతుమీ తేల్చుకోనుంది. అప్పుడెప్పుడో 1950–51లో ఈ జట్టు రంజీ ఫైనల్‌కు చేరినా తమ కలను నెరవేర్చుకోలేకపోయింది. అప్పటి నుంచి కనీసం రన్నరప్‌గా నిలిచే అవకాశం కూడా దక్కలేదు. 65 ఏళ్ల అనంతరం ఈసారి తమ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇక మరోవైపు రంజీ టైటిల్‌ను మంచినీళ్ల ప్రాయంలా తమ ఖాతాలో వేసుకోవడం అలవాటుగా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. 45 సార్లు ఈ జట్టు రంజీ ఫైనల్లోకి రాగా... ఏకంగా 41 సార్లు విజేతగా నిలిచిందంటే వీరి హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివరిసారిగా 1990–91 సీజన్ ఫైనల్లో హరియాణా చేతిలో ముంబై ఓడిపోయింది. అప్పటి నుంచి తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరగా ప్రతిసారీ ముంబైనే విజేతగా నిలిచింది.
బుమ్రా దూరం: బరిలోకి దిగకముందే గుజరాత్ జట్టు తమ కీలక పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను కోల్పోవాల్సి వచ్చింది. ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం అతను జాతీయ జట్టులో చేరనున్నాడు. అయితే జార్ఖండ్‌తో జరిగిన సెమీస్‌లో ఆర్పీ సింగ్ తన కెరీర్‌లోనే అద్భుత గణాంకాలు (6/29) నమోదు చేసి ఫుల్ జోష్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చేదే. రుష్ కలారియా, మెహుల్ పటేల్ కూడా బౌలింగ్ బాధ్యతను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్‌లో ప్రియాంక్ పాంచల్ ఇప్పటికే సీజన్‌లో అత్యధిక పరుగులు (1,270) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మరో ఓపెనర్ సమిత్ గోహెల్ (889 పరుగులు) కూడా మంచి ఫామ్‌లో ఉండడంతో జట్టుకు శుభారంభం అందనుంది. జునేజా, పార్థివ్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది.
సమష్టి బలంతో బరిలోకి: సీజన్ ఆద్యంతం ఆటగాళ్లు గాయాల బారిన పడినా ముంబై జట్టు తమ రిజర్వ్ బెంచ్ సత్తా ఏమిటో ప్రత్యర్థులకు రుచి చూపించింది. సెమీఫైనల్‌కు ముందు జట్టులో చేరిన టీనేజి సంచలనం పృథ్వీ షా తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి జట్టు విజయానికి కారకుడయ్యాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, కెప్టెన్ ఆదిత్య తారే, సిద్దేష్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ విజయ్ గోహిల్ ఇప్పటికే 27 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పేసర్లు శార్దుల్ ఠాకూర్, బల్విందర్ సంధూ కీలకం కానున్నారు.
ఉదయం గం. 9.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్–4లో
ప్రత్యక్ష ప్రసారం