
రబాడా, మోరిస్ పోరాటం వృథా
ముంబై: ఐపీఎల్-10లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 14 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో తడబడిన ముంబై.. ఆపై బౌలింగ్‌లో రాణించడంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆపై లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరమితమైంది.
ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించిన ముంబైకి తొలి మ్యాచ్ ఆడుతున్న రబడా బ్రేక్ వేశాడు. పార్థీవ్(8) ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు. ఆ వెంటనే బట్లర్ ను శాంసన్ రనౌట్ చేశాడు, అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా, రోహిత్ శర్మలు త్వరగా ఔటయ్యారు. బట్లర్ (28) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. కృనాల్ పాండ్యా(17) ను పెవిలియన్ కు పంపించడంతో ముంబై 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత హార్ధీక్ పాండ్యాతో ఆచితూచి ఆడిన పోలార్డ్ (26) ను కమిన్స్ అవుట్ చేయగా.. హర్భజన్(2)ను రబడా రనౌట్ చేశాడు. ఆ వెంటనే హార్ధీక్ పాండ్యా (24) కరుణ్ నాయర్ రనౌట్ చేశాడు. దీంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మిశ్రా, కమిన్స్ లు చెరో రెండు వికెట్లు తీయగా, రబడాకు ఓ వికెట్ దక్కింది.
143 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ముంబై బౌలర్లు కట్టడిచేశారు. ముగ్గురు టాపార్డర్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మరో ముగ్గురు బ్యాట్స్ మెన్స్ డకౌట్ కావడం గమనార్హం. రిషబ్ పంత్, ఆదిత్యా తారే, అండర్సన్ లు ఖాతా తెరవకుండానే సున్నా పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. సంజూ శాంసన్ (9), కరణ్ నాయర్ (5), శ్రేయస్ అయ్యర్ లు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. మెక్‌క్లీనగన్ చెలరేగడంతో 24 పరుగులకే ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రబాడా(44), మోరిస్(52 నాటౌట్) ఏడో వికెట్‌కు 91 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. కావాల్సిన రన్ రేట్ ఎక్కువ ఉండటంతో జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరమితమై ఓటమి పాలైంది.