
ముంబై ఇండియన్స్ అరుదైన ఫీట్
కోల్ కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో కోల్ కతా నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్కు చేరింది. అయితే ముంబై ఇండియన్స్ మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. ట్వంటీ 20 క్రికెట్ లో వంద మ్యాచ్ ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా ముంబై అరుదైన ఫీట్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 176 ట్వంటీ 20 మ్యాచ్ లాడిన ముంబై వంద విజయాలు సాధించగా, 73 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. మరో గేమ్ టైగా ముగియగా, రెండు రద్దయ్యాయి.
కాగా, ఐపీఎల్లో మాత్రం ముంబైకు ఇది 89వ విజయం. ఓవరాల్ ఐపీఎల్లో 154 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ 64 మ్యాచ్ ల్లో ఓటమి చెందగా, ఒకటి టైగా ముగిసింది. 2010 నుంచి 2014 వరకూ చాంపియన్స్ లీగ్ లో ముంబై ఇండియన్స్ 11 విజయాల్ని సొంత చేసుకోగా, తొమ్మిది ఓటముల్ని చవిచూసింది. దాంతో మొత్తంగా కలుపుకుని వంద ట్వంటీ 20 విజయాల్ని సాధించిన తొలి జట్టుగా ముంబై సరికొత్త ఘనతను కైవసం చేసుకుంది.