టైటిల్ పోరుకు ముంబై
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ టైటిల్ పోరుకు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. శుక్రవారం రాత్రి ఇక్కడ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. అమీతుమీ పోరులో ఆద్యంతం రాణించిన ముంబై ఇండియన్స్ మరోసారి తమదే పైచేయిగా నిరూపించుకుంది. తొలి క్వాలిఫయర్ లో ముంబై ఓటమి పాలైనప్పటికీ, క్వాలిఫయర్-2లో మాత్రం ఆకట్టుకుని ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
కోల్ కతా విసిరిన 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై ఆదిలోనే సిమన్స్(3),పార్ధీవ్ పటేల్(14), అంబటి రాయుడు(6) వికెట్లను కోల్పోయి తడబడింది. అయితే రోహిత్ శర్మ(26), కృణాల్ పాండ్యా(42 నాటౌట్) లు బాధ్యతాయుతంగా ఆడి గెలుపులో సహకరించారు. తద్వారా ఆదివారం హైదరాబాద్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. కీలక మ్యాచ్ లో కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ లు రాణిస్తారని భావించినా అది జరగలేదు. వీరిద్దరూ ఆది నుంచి ముంబై బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో లిన్(4) భారీ షాట్ కు పోయి తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై నరైన్(10) దూకుడుగా ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఉతప్ప, గంభీర్, గ్రాండ్ హోమ్ లు నిష్ర్రమించడంతో కోల్ కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఇషాంక్ జగ్గి- సూర్యకుమార్ యాదవ్ లు మరమ్మత్తులు చేపట్టారు. ఈ జోడి 56 పరుగులు జోడించడంతో కోల్ కతా పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే జగ్గి ఏడో ఆరో వికెట్ గా అవుటైన తరువాత కోల్ కతా ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. వరుస వికెట్లు కోల్పోతూ ముంబై బౌలింగ్ కు దాసోహమైంది. దాంతో 18.5 ఓవర్లలోనే కోల్ కతా 107 పరుగులకు ఆలౌటైంది.