
‘ముంబై’కి తలవంచారు
⇒సన్‌రైజర్స్‌కు తొలి ఓటమి
⇒4 వికెట్లతో ముంబై ఇండియన్స్ గెలుపు
⇒రాణించిన బుమ్రా, రాణా
సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఉత్సాహంతో కనిపించిన డిఫెండింగ్ చాంపియన్‌కు ప్రత్యర్థి వేదికపై పరాజయం పలకరించింది. బయటి మైదానంలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్ ఓటమిని ఆహ్వానించింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో సన్‌రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమై, ఆ తర్వాత దానిని కాపాడుకోవడంలోనూ విఫలమైంది. వాంఖెడే గడ్డపై ముందుగా బుమ్రా, హర్భజన్ బౌలింగ్‌తో రైజర్స్‌పై పట్టు బిగించిన ముంబై ఇండియన్స్... పార్థివ్, రాణా, కృనాల్‌ల బ్యాటింగ్‌తో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన ముంబై 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (43 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నితీశ్ రాణా (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పార్థివ్ పటేల్ (24 బంతుల్లో 39; 7 ఫోర్లు), కృనాల్ పాండ్యా (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒక దశలో తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు తీసి హైదరాబాద్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోల్‌కతాలో శనివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది.
ఓపెనింగ్ మినహా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ అంశం ఓపెనింగ్ భాగస్వామ్యం మాత్రమే. వార్నర్, ధావన్ తొలి వికెట్‌కు 62 బంతుల్లో 81 పరుగులు జోడించారు. తర్వాతి బ్యాట్స్‌మెన్ తడబడటంతో 50 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయి రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇన్నింగ్స్ తొలి రెండు ఓవర్లలో ఐదు పరుగులే రాగా, హర్భజన్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి వార్నర్ ధాటిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మలింగ ఓవర్లోనూ వార్నర్ మరో రెండు ఫోర్లు బాదాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సన్‌కు కలిసొచ్చింది. మెక్లీనగన్ వేసిన ఈ ఓవర్లో ధావన్ చెలరేగి 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఒక దశలో వార్నర్ తాను ఎదుర్కొన్న మూడు వరుస బంతులను 4, 4, 6 గా మలిచాడు.
అయితే భజ్జీ రైజర్స్ దూకుడును అడ్డుకున్నాడు. తొలి బంతిని స్విచ్ హిట్‌తో సిక్స్ కొట్టిన వార్నర్, తర్వాతి బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయి అవుటయ్యాడు. హుడా (9) ఎక్కువసేపు నిలవలేకపోగా, ధావన్‌ను మెక్లీనగన్ బౌల్డ్ చేయడంతో రైజర్స్ పతనం వేగంగా సాగింది. యువరాజ్ (5) విఫలం కాగా, కటింగ్ (10 బంతుల్లో 20; 4 ఫోర్లు) జోరును బుమ్రా అడ్డుకున్నాడు. తొమ్మిది పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ చివరి ఐదు ఓవర్లలో 40 పరుగులే చేసింది.
పార్థివ్ మెరుపులు...: లక్ష్య ఛేదనను ముంబై వేగంగా ప్రారంభించింది. నెహ్రా వేసిన రెండో ఓవర్లో ఆ జట్టు మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టింది. అయితే నెహ్రా తన తర్వాతి ఓవర్లోనే బట్లర్ (14)ను అవుట్ చేసి రైజర్స్‌కు బ్రేక్ ఇవ్వగా, మరో ఎండ్‌లో పార్థివ్ దూకుడుగా ఆడాడు. రషీద్ ఖాన్ మరోసారి సత్తా చాటుతూ తొలి ఓవర్లోనే రోహిత్ (4)ను వెనక్కి పంపడంతో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. అయితే ముస్తఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 19 పరుగులు కొల్లగొట్టిన ముంబై దూసుకుపోయింది. పార్థివ్, రాణా కలిసి చకచకా పరుగులు జోడించి 29 బంతుల్లో 38 పరుగులు జత చేశారు. ఈ దశలో పార్థివ్‌ను హుడా అవుట్ చేయగా, పొలార్డ్ (11) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో కృనాల్ చెలరేగిపోయాడు. రషీద్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అతను, నెహ్రా వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. కటింగ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా రెచ్చిపోయి రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లోనే భువనేశ్వర్ చక్కటి బౌలింగ్‌తో కృనాల్, రాణాలను అవుట్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది.
వార్నర్ బ్యాటింగ్ ఎలా?: సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక పెద్ద అంపైరింగ్ పొరపాటు చోటు చేసుకుంది. బుమ్రా వేసిన ఆరో ఓవర్ చివరి బంతిని వార్నర్ ఫోర్‌గా మలిచాడు. తర్వాతి ఓవర్ తొలి బంతిని వాస్తవంగా ధావన్ ఎదుర్కోవాలి. అయితే మెక్లీనగన్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని కూడా వార్నరే ఆడాడు. అంపైర్ ఈ పొరపాటును గుర్తించకపోవడంతో ఆట సాగిపోయింది!
ఐపీఎల్‌లో నేడు
►కోల్‌కతా నైట్‌రైడర్స్ & కింగ్స్ ఎలెవన్ పంజాబ్
►వేదిక: కోల్‌కతా, రాత్రి గం. 8.00 నుంచి
►సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం