ఢిల్లీ గజగజ...
►66 పరుగులకే ఆలౌట్
►ముంబై ఇండియన్స్ ఘనవిజయం
►చెలరేగిన బౌలర్లు
►సిమన్స్, పొలార్డ్ మెరుపులు
తమ చివరి మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఈసారి మాత్రం తుస్సుమంది. ముంబై ఇండియన్స్ విధించిన 213 పరుగుల భారీ టార్గెట్‌లో తొలి బంతి నుంచే తడబడిన ఈ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. గుజరాత్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన సామ్సన్, రిషభ్ అసలు పరుగులేమీ చేయకుండానే వెనుదిరగడంతో అత్యంత చెత్త ఆటతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ అవకాశాలకు దాదాపుగా తెర దించుకున్నట్టయ్యింది. అటు ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ చిగురుటాకులా వణికింది. 213 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఈ జట్టు ఆటగాళ్లు కనీసం పోరాటం చేయకుండానే అవమానకరంగా తోక ముడిచారు. ఫలితంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 146 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం కావడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 212 పరుగులు చేసింది. సిమన్స్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్ (35 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా... ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరిశాడు. అనంతరం ఢిల్లీ జట్టు 13.4 ఓవర్లలో 66 పరుగులకు కుప్పకూలింది. కరణ్ శర్మ, హర్భజన్‌లకు మూడేసి వికెట్లు దక్కగా... మలింగ రెండు వికెట్లు తీశాడు.
సిమన్స్, పొలార్డ్ దూకుడు
ముంబై జట్టులో బట్లర్ స్థానంలో బరిలోకి దిగిన ఓపెనర్ సిమన్స్ మెరుపు ఆరంభాన్ని అందిస్తే చివరి పది ఓవర్లలో పొలార్డ్ మెరుపులు జట్టుకు భారీ స్కోరును అందించింది. నాలుగో ఓవర్‌లో సిమన్స్ ఓ సిక్స్, ఫోర్‌తో తన జోరును ఆరంభించగా అటు పార్థివ్ (25; 3 ఫోర్లు) కూడా వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 60 పరుగులకు చేరింది. మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పార్థివ్ స్టంప్ కావడంతో తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 36 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన సిమన్స్ అండర్సన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదిన అనంతరం క్యాచ్ అవుటయ్యాడు. అయితే మూడో స్థానంలో బరిలోకి దిగిన పొలార్డ్ ఏమాత్రం తగ్గకుండా ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా మిశ్రా బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ... రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టగా... పొలార్డ్ మరో ఫోర్ బాదాడు. దీంతో 23 పరుగులు రావడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది.
వికెట్లు టపటపా...
భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ జట్టును ముంబై బౌలర్లు కోలుకోనీయకుండా దెబ్బతీశారు. తొలి బంతి నుంచే ప్రారంభమైన ఢిల్లీ పతనం ఏ దశలోనూ ఆగలేదు. మొదటి ఆరు ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ సామ్సన్‌ను మెక్లీనగన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత శ్రేయస్ (3)ను మలింగ.. రిషభ్ పంత్‌ను బుమ్రా.. కరుణ్ నాయర్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్)ను హర్భజన్ తాము వేసిన తొలి ఓవర్లలోనే పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం వచ్చిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.