ఐపీఎల్-10: ఫైనల్ కు చేరేదెవరో?
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత రైజింగ్ పుణెను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ సీజన్ లీగ్ దశలో రైజింగ్ పుణెతో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబైకి ఓటమి ఎదురైంది. దాంతో అసలు సిసలు సమరంలో పుణెపై ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై సిద్ధమైంది.
మరొకవైపు ఫైనల్ బెర్త్ దక్కించుకున్న తొలి జట్టుగా నిలవాలని ముంబై ఆశిస్తోంది. అదే సమయంలోముంబైపై తమకున్న సూపర్ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ మరోసారి పైచేయి సాధించాలని పుణే భావిస్తోంది. అయితే ప్రారంభంలోకన్నా రెండో దశలో అనూహ్య ఆటతీరుతో చెలరేగుతున్న పుణే... ఇప్పటికే తాహిర్ సేవలను కోల్పోగా తాజాగా డాషింగ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండానే బరిలోకి దిగబోతోంది. దీంతో అద్భుత ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేయాలంటే ఆ జట్టు తీవ్రంగా శ్రమించక తప్పదు.
పుణే జట్టు ప్లే ఆఫ్ వరకు చేరుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదు. అయితే మ్యాచ్‌లు జరుగుతున్నకొద్దీ ఈ జట్టు ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆరితేరుతూ ప్రత్యర్థులను మట్టికరిపించింది. పుణె పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టి ఆ జట్టులో కీలక బౌలర్ గా మారాడు. అతనికి శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ సహకరిస్తున్నారు. ఈ త్రయం మరోసారి ముంబైపై విజృంభించాలని భావిస్తుంది. స్పిన్నర్ జంపా కూడా రాణించడం ఈ జట్టుకు కలిసొచ్చేది. బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, రహానే, ధోని, మనోజ్ తివారి ఫామ్‌లో ఉండడం అనుకూలాంశం. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే క్రమంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.ఒకవేళ తొలి క్వాలిఫయర్ లో ఓడితే 19న బెంగళూరులో జరిగే రెండో క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. మరి తుది పోరుకు ముందుగా ఎవరు చేరతారో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.