కృనాల్ పాండ్యా వీరబాదుడు
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్లోముంబై ఇండియన్స్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కృనాల్ పాండ్యా(86;37 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు.22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కృనాల్.. ఆ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించి ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(31;21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), గప్తిల్(48;42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేశారు.అనంతరం కృనాల్ పాండ్యా వీరబాదుడు బాది ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా కృనాల్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. అయితే 18.0 ఓవర్ లో ఆఫ్ స్టంప్ బయటకు వెళుతున్న బంతిని వెంటాడిన కృనాల్ బౌల్డ్ కావడంతో ముంబై జోరు కాస్త తగ్గింది. ఇక చివర్లో బట్లర్(18 నాటౌట్;9 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్),అంబటి రాయుడు(13 నాటౌట్;5 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ కు రెండు వికెట్లు దక్కగా, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది.