
కుంబ్లే నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
కుర్రాళ్లకు మంచి అవకాశమన్న విజయ్
బెంగళూరు: భారత కోచ్ అనిల్ కుంబ్లే నుంచి మరిన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుందని ఓపెనర్ మురళీ విజయ్ అభిప్రాయ పడ్డాడు. ఆటగాళ్లంతా కొత్త కోచ్‌తో కలిసి పని చేయడంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అతను అన్నాడు. కుంబ్లే, కోహ్లి భాగస్వామ్యంపై తాను ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించనని, అయితే రాబోయే 12 నెలలు భారత క్రికెట్‌కు అద్భుతమైన రోజులు అవుతాయని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
‘నా కెరీర్ తొలి టెస్టు, కుంబ్లే ఆడిన ఆఖరి టెస్టు ఒకటే కావడం యాదృచ్ఛికం. అప్పుడు ఆయనతో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదు. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు అభిమానిని. ఇప్పుడు కలిసి పని చేస్తే ఎంతో నేర్చుకోవచ్చు’ అని అతను అన్నాడు. వెస్టిండీస్ గడ్డపై గత సిరీస్‌లో తాను విఫలమయ్యానని, ఈ సారి బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నట్లు విజయ్ పేర్కొన్నాడు.