పట్టు చేజారినట్టే (నా)! | Murali Vijay stays defiant as India look to build lead | Sakshi
Sakshi News home page

పట్టు చేజారినట్టే (నా)!

Published Sun, Jul 20 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

పట్టు చేజారినట్టే (నా)!

పట్టు చేజారినట్టే (నా)!

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 169/4
 పోరాడుతున్న విజయ్, ధోని
 ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

 
 భువనేశ్వర్ ఆరు వికెట్లతో విజృంభించినా... ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఆపై బ్యాట్స్‌మెన్ సహనంతో ఆడితే పట్టు సాధించే అవకాశమున్నా... మూడో రోజే నాలుగు కీలక వికెట్లు కోల్పోయారు. అర్ధసెంచరీతో మురళీ విజయ్, తోడుగా ధోని పోరాడుతున్నా... ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో రెండో టెస్టులో భారత్ ఆత్మరక్షణలో పడింది. గెలుపు మాట అటుంచి... మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే ఆదివారం ఆట కీలకం కానుంది.
 
 లండన్: భారత్ పట్టు సాధించగలదనుకున్న రెండో టెస్టులో ‘డ్రా’ కోసం ప్రయత్నించే దిశగా పయనిస్తోంది. బౌలింగ్‌లో రెండో రోజు సాధించిన పట్టును సడలించడంతో... శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 319 పరుగుల దాకా వెళ్లింది. బౌలర్ ప్లంకెట్ (79 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ఇంగ్లండ్‌కు 24 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. భువనేశ్వర్ (6/82) రాణించాడు.
 
 ఆపై రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ప్లంకెట్ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి దెబ్బకొట్టగా... మురళీ విజయ్ (190 బంతుల్లో 59 బ్యాటింగ్; 7 ఫోర్లు), ధోని (51 బంతుల్లో 12 బ్యాటింగ్; 2 ఫోర్లు) పోరాడుతున్నారు. మొత్తంగా టీమిండియాకు 145 పరుగుల ఆధిక్యం లభించింది.
 
 సెషన్-1: భువీ  హవా
 ఓవర్‌నైట్ స్కోరు 219/6తో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్లంకెట్, ప్రయర్‌లు జాగ్రత్తగా ఆడారు. ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించాక ప్రయర్ (42 బంతుల్లో 23; 4 ఫోర్లు)ను అవుట్ చేసి షమీ... భారత్‌కు బ్రేక్‌నిచ్చాడు. ఆ వెంటనే భువనేశ్వర్ మరోసారి చెలరేగుతూ ఒకే ఓవర్లో  స్టోక్స్, బ్రాడ్‌లను అవుట్ చేశాడు. దీంతో 15 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. మరోవైపు ప్లంకెట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి వికెట్‌గా జడేజా బౌలింగ్‌లో అండర్సన్ (21 బంతుల్లో 19; 3 ఫోర్లు) అవుటయ్యాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 4 ఓవర్లు ఆడి 11/0తో లంచ్‌కు వెళ్లింది.
 ఓవర్లు: 23.5; పరుగులు: 111; వికెట్లు: 4
 (భారత్: ఓవర్లు: 4; పరుగులు: 11; వికెట్లు: 0)


 సెషన్-2: విజయ్ నిలకడ
 లంచ్ విరామం తర్వాత భారత ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ధావన్, విజయ్‌లు క్రీజులో నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. నాలుగు ఫోర్లతో ధావన్ దూకుడు ప్రదర్శించినా... స్టోక్స్ వేసిన బంతిని పాయింట్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి మరోసారి శుభారంభాన్ని ధావన్ (45 బంతుల్లో 31; 4 ఫోర్లు) వృథా చేసుకున్నాడు. దీంతో 40 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.  
 ఓవర్లు: 27; పరుగులు: 73; వికెట్లు: 1
 
 సెషన్-3: చెలరేగిన ప్లంకెట్
 టీ విరామం తర్వాత భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. రెండో వికెట్‌కు 35 పరుగులతో విజయ్-పుజారా జోడి సాఫీగా సాగుతున్న తరుణంలో ప్లంకెట్ అనూహ్యంగా దెబ్బతీశాడు. 44వ ఓవర్లో వరుస బంతుల్లో పుజారా (83 బంతుల్లో 43; 7 ఫోర్లు), విరాట్ కోహ్లి (0)లను అవుట్ చేశాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని తన స్వభావానికి విరుద్ధంగా ఆడిన పుజారా... కీపర్ ప్రయర్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే కోహ్లి... ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డయ్యాడు.
 
 తక్కువ ఎత్తులో వస్తున్న బంతిని అంచనా వేయడంలో విఫలమై కోహ్లి బ్యాట్‌ను పెకైత్తాడు. బంతి బెయిల్స్‌ను తాకుతూ వెళ్లింది. ఇక ప్లంకెట్‌కు రహానే హ్యాట్రిక్‌ను నిరాకరించినా... కొద్దిసేపటికే అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. దీంతో 123 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని... విజయ్‌కి అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ల ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో విజయ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఐదో వికెట్‌కు వీరిద్దరు అజేయంగా 46 పరుగులు జోడించారు.
 ఓవర్లు: 32; పరుగులు: 85; వికెట్లు: 3
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్
 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్:  319 ఆలౌట్
 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ బ్యాటింగ్ 59; ధావన్ (సి) రూట్ (బి) స్టోక్స్ 31; పుజారా (సి) ప్రయర్ (బి) ప్లంకెట్ 43; కోహ్లి (బి) ప్లంకెట్ 0; రహానే (సి) ప్రయర్ (బి) బ్రాడ్ 5; ధోని బ్యాటింగ్ 12; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (63 ఓవర్లలో 4 వికెట్లకు) 169
 వికెట్ల పతనం: 1-40, 2-118, 3-118, 4-123.
 బౌలింగ్: అండర్సన్ 18-7-36-0; బ్రాడ్ 14-5-41-1; స్టోక్స్ 13-2-35-1; ప్లంకెట్ 12-5-24-2; అలీ 6-1-14-0.
 
 రహానే... బ్యాడ్‌లక్
 తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి ఫామ్‌లో ఉన్న రహానేను రెండో ఇన్నింగ్స్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయం బలి తీసుకుంది. బ్రాడ్ వేసిన షార్ట్ పిచ్ బంతి రహానే ఆర్మ్‌గార్డ్‌ను తాకుతూ వెళ్లి కీపర్ చేతిలో పడింది. కానీ, ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీలు చేయగానే... బంతి గ్లవ్స్‌ను తాకినట్లుగా భావించిన అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ వేలిని పెకైత్తాడు. రహానే అసంతృప్తితో క్రీజును వీడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement