
ఢాకా: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 9 గంటల 49 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన ముష్ఫికర్ (421 బంతుల్లో 219 నాటౌట్; 18 ఫోర్లు, 1 సిక్స్) సాధించిన అజేయ ద్విశతకంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కోరు నమోదు చేసింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 522 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 25 పరుగులు చేసిన జింబాబ్వే మరో 497 పరుగులు వెనుకబడి ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 303/5తో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ వేగంగా పరుగులు సాధించింది. తన స్కోరుకు రెండో రోజు మరో 108 పరుగులు జోడించిన ముష్ఫికర్‌కు ఆరంభంలో మహ్ముదుల్లా (36) అండగా నిలిచాడు. ఆరిఫుల్ (4) త్వరగానే ఔటైనా...మెహదీ హసన్ (102 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి బంగ్లా కీపర్ భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. టీ విరామం తర్వాత మవుటా వేసిన బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో ముష్ఫికర్ డబుల్ సెంచరీ పూర్తయింది. గతంలో వికెట్ కీపర్లు ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సంగక్కర (శ్రీలంక), ధోని (భారత్), తస్లీం ఆరిఫ్ (పాకిస్తాన్), ఇంతియాజ్ అహ్మద్ (పాకిస్తాన్), గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా), కురుప్పు (శ్రీలంక) ఒక్కో డబుల్ సెంచరీ మాత్రమే చేయగా... ఇప్పుడు ముష్ఫికర్ వారిని అధిగమించి రెండో డబుల్‌ను నమోదు చేశాడు. మరోవైపు బంగ్లాదేశ్ తరఫున షకీబ్ (217) పేరిట ఉన్న అత్యధిక స్కోరును, అత్యధిక బంతులు ఆడిన అష్రాఫుల్ (417) ఘనతను, అత్యధిక సమయం క్రీజ్‌లో నిలిచిన అమీనుల్ ఇస్లాం (535 నిమిషాలు) రికార్డును కూడా ముష్ఫికర్ సవరించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment