
'పసిడిని గెలవడమే నా లక్ష్యం'
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో స్వర్ణం పతకం సాధించడమే తన లక్ష్యమని ఇప్పటికే రజత పతకం ఖాయం చేసుకున్న భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు స్పష్టం చేసింది. ఇందుకోసం పూర్తిస్థాయిలో ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తానని పేర్కొంది. 'ఒలింపిక్స్ లో పతకం గెలవడం ప్రతీ అథ్లెట్ లక్ష్యం. ఆ ఘనతను సాధించినందుకు గర్వంగా ఉంది. ఇంకా నా ముందు మరొక టార్గెట్ ఉంది. స్వర్ణ పతకం సాధించి ఘనంగా ఒలింపిక్స్ను ముగించాలని అనుకుంటున్నా. అందుకోసం శక్తివంచన లేకుండా ఆడతా. పసిడిని సాధిస్తానననే నమ్మకం ఉంది' అని సింధూ పేర్కొంది.
తనపై ఎటువంటి ఒత్తిడి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన సింధూ.. 100 శాతం ఆట తీరును కనబరచడమే తన తదుపరి లక్ష్యమని తెలిపింది. ఇప్పటికే ఫైనల్ పోరు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని, కాకపోతే ఆ మ్యాచ్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ను ఓడించడం అంత సులువు కాకపోవచ్చని పేర్కొంది. వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా ఒక కఠినమైన ప్రత్యర్థి అనడంలో ఎటువంటి సందేహం లేదని సింధూ అభిప్రాయపడింది. గత కొంతకాలంగా కరోలినా మెరుగైన ప్రదర్శన ఇస్తున్న సంగతిని సింధు గుర్తు చేసింది. కాగా, తన పూర్తిస్థాయి ఆటను ప్రదర్శిస్తే మాత్రం కచ్చితంగా విజయం దక్కుతుందని పేర్కొంది. శనివారం రాత్రి గం.7.30 ని.లకు పివి సింధు-మారిన్ల మధ్య అంతిమ పోరు జరుగనుంది.