అలా ఆడేందుకు సిగ్గుపడను : భారత క్రికెటర్
బ్యాటింగ్ లో తాను మిడిల్, లోయర్ ఆర్డర్లో ఆడాలని కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తే దానిని అమలు చేసేందుకు తాను ఎప్పుడూ సిగ్గుపడనని భారత డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్శర్మ అంటున్నాడు. తాను ముఖ్యంగా సహజశైలిలో ఆడేందుకు ఇష్టపడతానని, అయితే పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి వచ్చినప్పుడు వన్డేలా, టెస్టులా అని ఆలోచించనని చెప్పాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరు(9)కే అవుటైన రోహిత్, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగిపోయి కేవలం 59 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 ఫోర్ బాది 41 పరుగులు చేసి భారత్ ఆధిక్యంతో పాటు రన్ రేట్ ను చాలా త్వరగా పెంచేశాడు.
వాస్తవానికి బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి లయను దెబ్బతీస్తూ వారిని ఒత్తిడిలోకి నెట్టడం తనకు ఇష్టమన్నాడు. అయితే ఇందుకోసం తాను ఆడతున్నతి ఓవర్లో తొలి బంతినా లేక చివరి బంతా.. అనే దాంతో సంబంధం లేకుండా షాట్లు ఆడతానన్నాడు. తాను ఎలా బ్యాటింగ్ చేయాలో.. ఎలా చేయకూడదో తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. వన్డేల్లో ఆడిన తరహాలో టెస్టుల్లో ఆడటం కుదరదని చెప్పాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటాన్ని తాను అలవర్చుకోవడంతో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో కోచ్, కెప్టెన్ చెబితే తాను సులువుగా అందుకు తగ్గట్టుగా ఆట తీరును మార్చుకుంటానని రోహిత్ శర్మ వెల్లడించాడు. గతేడాది లంకతో సిరీస్ లో ఇదే పాటించానని గుర్తుచేశాడు.