ముంబై : ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఓటమి అనంతరం ఓపెనర్ రోహిత్ శర్మతో విభేదాలు తలెత్తాయన్నా వార్తలను సారథి విరాట్ కోహ్లి కొట్టిపారేశాడు. వెస్టిండీస్ పర్యటనకు భారత క్రికెట్ జట్టు బయల్దేరి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు ఆసక్తిక విషయాలను వెల్లడించాడు. ప్రపంచకప్ ఓటమి ప్రభావం కుర్రాళ్లపై పడకూడదనే ఉద్దేశంతోనే విండీస్ టూర్‌కు విశ్రాంతి తీసుకోలేదని వివరించాడు. ఇక రోహిత్ శర్మతో వాగ్వాదం జరిగిందని, మాట్లాడుకోవడం లేదనేది అసత్యమని తేల్చిచెప్పారు.
‘రోహిత్-కోహ్లి మధ్య విభేదాలు అనే వార్తలు నేను కూడా విన్నాను. డ్రెస్సింగ్ రూంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే విజయం వరిస్తుంది. ఒకవేళ ఆ వార్తలే నిజమైతే.. మేం ఇంత గొప్పగా రాణించేవాళ్లం కాదు. విజయాలు సాధించే వాళ్లం కాదు. నేను ఎవరినైనా ద్వేషిస్తే అది నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను రోహిత్‌ని ఎప్పుడు ప్రశంసిస్తూనే ఉంటాను. ప్రపంచకప్ హీరో అయిన రోహిత్‌తో నేను గొడవపడటం ఏంటి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇవన్నీ సృష్టించడం వల్ల ఎవరు లాభపడ్డారో అందరికీ తెలుసు. డ్రెస్సింగ్ రూంలో సీనియర్లను ఎలా గౌరవిస్తామో.. జూనియర్లతో కూడా అలానే ఉంటాం. టీమిండియా ప్రదర్శన, ఆటగాళ్ల తీరును చూస్తే ఎటుమంటి సమస్యలు మా మధ్య లేవనే అనుకుంటున్నాను. రవి భాయ్(రవి శాస్త్రి)నే కోచ్‌గా కొనసాగిస్తే.. మాకు అది ఆనందమే. ఈ విషయంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)తో నేను మాట్లాడలేదు’అంటూ కోహ్లి వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment