
సిడ్నీ: మానసిక సమస్యలు కారణంగా గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఆసీస్ హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. త్వరలో ఆరంభం కానున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహించేందుకు మ్యాక్సీ సిద్ధమయ్యాడు. ఈ మేరకు తన మానసిక సమస్యను అర్థం చేసుకుని కోలుకోవడానికి నిరవధిక విరామాన్ని ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు మ్యాక్స్‌వెల్ ధన్యవాదాలు తెలియజేశాడు. తనకు మానసిక ఇబ్బందులున్నాయని, దాంతో కొంతకాలం విశ్రాంతి కావాలని అక్టోబర్‌లో సీఏను కోరాడు. మ్యాక్సీ విజ్ఞప్తిని మన్నించిన సీఏ.. అతనికి విరామాన్ని ఇచ్చింది. దాంతో దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు మ్యాక్సీ. తాను తిరిగి కోలుకున్నానని, ఇక సుదీర్ఘ సమయం అవసరం లేదని మ్యాక్స్‌వెల్ స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఫలితంగా బీబీఎల్‌తో తన రీఎంట్రీ ఇవ్వబోయే విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించాడు.
తన పునరాగమనంపై మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ.. ‘ నేను స్వింగ్‌లోకి వచ్చేశా. గత కొంత కాలంగా నేను మానసికంగా చాలా సతమతమయ్యా. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. గత ఎనిమిది నెలలుగా విరామం లేకుండా తిరగడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయా. భారీ భారం మోస్తున్నట్లు అనిపించేది. ఆ కారణంగా దేనిపైనా దృష్టి పెట్టలేకపోయా. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు. ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెబుతుంటే నా పార్టనర్ విశ్రాంతి తీసుకోమని చెప్పింది. నా సమస్యను గుర్తించిన మొదటి వ్యక్తి నా పార్టనరే. ఇప్పుడు నా భుజాలపై నుంచి భారీ భారం దిగినట్లు ఉంది. నా సమస్యను అర్థం చేసుకుని నిరవధిక విరామాన్ని ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియాకు చాలా థాంక్స్’ అని మ్యాక్సీ పేర్కొన్నాడు. మరి మ్యాక్స్‌వెల్ పార్టనర్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన విని రామన్ కావొచ్చు. ఈ పేరును మ్యాక్సీ వెల్లడించకపోయినా ఆమెతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment