ఇదేం బౌలింగ్‌రా నాయనా.. ఆడమ్స్‌ను మించిపోయావే! | Sakshi
Sakshi News home page

ఇదేం బౌలింగ్‌రా నాయనా.. ఆడమ్స్‌ను మించిపోయావే!

Published Tue, Nov 19 2019 12:36 PM

Mystery Sri Lanka Spinner Bowls Just Like Paul Adams - Sakshi

అబుదాబి: శ్రీలంకకు చెందిన కెవిన్‌ కొతత్తిగొడ తన బౌలింగ్‌ యాక్షన్‌తో వార్తల్లో నిలిచాడు. అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా బంగ్లా టైగర్స్‌ తరఫున ఆడుతున్న కొతత్తిగొడ.. డెక్కన్‌ గ్లాడియేటర్స్‌తో మూడు రోజుల క్రితం  తన వైవిధ్యమైన బౌలింగ్‌తో క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. గతంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ పాల్‌ ఆడమ్స్‌ ఇదే తరహాలో బౌలింగ్‌ వేస్తూ హాట్‌ టాపిక్‌గా మారగా, ఇప‍్పుడు పాల్‌ ఆడమ్స్‌నే మించిపోయి మరీ బౌలింగ్‌ వేశాడు ఈ 24 ఏళ్ల శ్రీలంక స్పిన్నర్‌.

90 దశకాల్లోని క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ పాల్‌ ఆడమ్స్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బంతి విసిరడానికి ముందు తలను పూర్తిగా కిందకు వంచి రెండు చేతులూ పైకి చాస్తూ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు బంతులేసేవాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ తరహా బౌలింగ్ యాక్షన్‌ మనకు దాదాపు కరువైందనే చెప్పాలి.  తాజాగా కొతత్తిగొడ.. ఆడమ్స్‌ను గుర్తు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో గాలే క్రికెట్ క్లబ్ తరుపున లిస్ట్-ఎ, టీ20 మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేశాడు. లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసిన అతడు నాలుగు టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 2017 ఐపీఎల్‌లో గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఆడిన శివం కౌశిక్‌ది కూడా ఈ విధమైన ప్రత్యేకమైన బౌలింగ్‌ శైలే కావడం విశేషం.  ఇప‍్పుడు కెవిన్‌ కొతత్తిగొడ బౌలింగ్‌ యాక్షన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో అభిమానులు విపరీతమైన ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇదే బౌలింగ్‌రా నాయనా.. పాల్స్‌ ఆడమ్స్‌ను మించిపోయావే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement