Abu Dhabi T10 League
-
అబుదాబీ టీ10 లీగ్ విజేత డెక్కన్ గ్లాడియేటర్స్
అబుదాబీ టీ10 లీగ్ 2024 ఎడిషన్ విజేతగా డెక్కన్ గ్లాడియేటర్స్ అవతరించింది. మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో నిన్న (డిసెంబర్ 2) జరిగిన ఫైనల్లో గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సాంప్ ఆర్మీ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్), వికెట్‌కీపర్ ఆండ్రియస్ గౌస్ (9 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) ఓ మోస్తరు పరుగులు చేశారు. షర్జీల్ ఖాన్ 5, అసలంక 13, జాక్ టేలర్ 1, కరీమ్ జనత్ 16 (నాటౌట్), రోహన్ ముస్తఫా 0, ఇమాద్ వసీం 7, ఖైస్ అహ్మద్ 1 (నాటౌట్) పరుగు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, తీక్షణ, నోర్జే, ఉస్మాన్ తారిక్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేర్స్.. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (21 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (10 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో 6.5 ఓవర్లలోనే 2 వికెట్ల కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. ఆఖర్లో రిలీ రొస్సో (5 బంతుల్లో 12; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. జోస్ బట్లర్ (5 బంతుల్లో 12 నాటౌట్; సిక్స్) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు ఇది మూడో టైటిల్. 2021-22, 2022 ఎడిషన్లలో కూడా గ్లాడియేటర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. -
Abu Dhabi T10 League: ఫైనల్లో సాంప్ ఆర్మీ
అబుదాబీ టీ10 లీగ్‌లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీ జట్టు ఫైనల్‌కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 2) జరిగిన క్వాలిఫయర్-2లో సాంప్ ఆర్మీ.. ఢిల్లీ బుల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నిఖిల్ చౌదరీ (16), రోవ్‌మన్ పావెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇసురు ఉడాన 3, అమీర్ హమ్జా 2, ఇమాద్ వసీం, కరీం జనత్ తలో వికెట్ తీసి ఢిల్లీ బుల్స్‌ను కట్టడి చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ మరో ఐదు బంతులు మిగిలుండగానే (ఐదు వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆండ్రియస్ గౌస్ (38), జాక్ టేలర్ (23 నాటౌట్) సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్లుగా నిలిచారు. జాక్ టేలర్ తొమ్మిదో ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది సాంప్ ఆర్మీని గెలిపించాడు. ఇవాళ రాత్రి 9 గంటలకు జరిగే ఫైనల్లో సాంప్ ఆర్మీ.. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న డుప్లెసిస్.. వీడియో
అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా ఢిల్లీ బుల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. అమీర్ హంజా బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ కొట్టిన బంతిని డుప్లెసిస్ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇది జరిగింది. ఈ ఓవర్లో డుప్లెసిస్ రెండు క్యాచ్‌లు పట్టాడు. షాదాబ్ ఖాన్ క్యాచ్‌కు ముందు డుప్లెసిస్ టామ్ బాంటన్ క్యాచ్ కూడా పట్టుకున్నాడు.WHAT A STUNNER FROM 40-YEAR-OLD FAF DU PLESSIS IN T10 LEAGUE 🤯 pic.twitter.com/LV9KLNHuPt— Johns. (@CricCrazyJohns) December 2, 2024ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ మొత్తంగా మూడు క్యాచ్‌లు పట్టాడు. ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్లో మరో సూపర్ క్యాచ్‌తో డుప్లెసిస్ రోవ్‌మన్ పావెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. 40 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్ మైదానంలో పాదరసంలా కదలడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇసురు ఉడాన 3, అమీర్ హంజా 2, కరీం జనత్, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టి ఢిల్లీ బుల్స్‌ను కట్టడి చేశారు. ఢిల్లీ బుల్స్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నిఖిల్ చౌదరీ (16), రోవ్‌మన్ పావెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. -
వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. ఆ కసి అక్కడ చూపించేశాడు!
అబుదాబి టీ20 లీగ్-2024లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిస్టో విధ్వంసం సృష్టించాడు. ఈ ధానాధన్ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం వహిస్తున్న బెయిర్ స్టో.. శుక్రవారం మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ఊచకోత కోశాడు. కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో టీమ్ అబుదాబి కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. అబుదాబి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. చివరి నాలుగు బంతుల్లో జానీ నాన్‌స్ట్రైక్‌లో ఉండకపోవడంతో అబుదాబి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ అబుదాబి .. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9.4 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది.వేలంలో అమ్ముడుపోని జానీ..ఇక మ్యాచ్‌లో దుమ్ము లేపిన జానీ బెయిర్ స్టో.. ఐపీఎల్-2025 వేలంలో మాత్రం అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌లకు బెయిర్‌స్టో ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
కుసాల్ పెరీరా ఊచకోత
అబుదాబీ టీ10లో శ్రీలంక ఆటగాడు కుసాల్ పెరీరా రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో న్యూయార్క్ స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పెరీరా.. నార్త్రన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో పెరీరా 27 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా న్యూయార్క్ స్ట్రయికర్స్ 9 వికెట్ల తేడాతో నార్త్రన్ వారియర్స్‌ను చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 15 బంతుల్లో 30, కొలిన్ మున్రో 15 బంతుల్లో 10, జాన్సన్ ఛార్లెస్ 11 బంతుల్లో 20 పరుగులు చేసి ఔట్ కాగా.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (17 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), అజ్మతుల్లా (2 బంతుల్లో 2) అజేయంగా నిలిచారు. స్ట్రయికర్స్ బౌలర్లలో సునీల్ నరైన్‌కు రెండు వికెట్లు లభించాయి.అనంతరం 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. కుసాల్ పెరీరా ఊచకోత ధాటికి కేవలం 8 ఓవర్లలోనే (వికెట్ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆసిఫ్ అలీ (12 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) పెరీరాకు అండగా నిలిచాడు. డెవాల్డ్ బ్రెవిస్ 10 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. వారియర్స్ బౌలర్లలో అజ్మతుల్లాకు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో స్ట్రయికర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. -
3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్న శ్రీలంక బౌలర్
అబుదాబీ టీ10 లీగ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనక చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ లీగ్‌లో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షనక.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ వేసిన షనక తొలి నాలుగు బంతులకు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఇందులో రెండో నో బాల్స్ ఉన్నాయి. అనంతరం ఐదో బంతి సిక్సర్ కాగా.. ఆరో బంతి నో బాల్ అయ్యింది. తిరిగి ఏడో బంతి కూడా నో బాల్ కాగా.. ఈ బంతి బౌండరీకి తరలివెళ్లింది.మొత్తంగా షనక ఓవర్ తొలి మూడు బంతుల్లో 4 నో బాల్స్ వేశాడు. దీంతో మూడు బంతులు ఏడు బంతులయ్యాయి. ఏడు బంతుల్లో బ్యాటర్ నిఖిల్ చౌదరీ ఐదు బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఓ బాల్ డాట్ బాల్‌గా మారింది. ఓవర్ చివరి మూడు బంతులకు సింగిల్స్ రావడంతో ఈ ఓవర్లో మొత్తంగా 33 పరుగులు వచ్చాయి.ఢిల్లీ బుల్స్, బంగ్లా టైగర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. బుల్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిథ్ 1, టామ్ బాంటన్ 8, జేమ్స్ విన్స్ 27, రోవ్‌మన్ పావెల్ 17, టిమ్ డేవిడ్ 1, షాదాబ్ ఖాన్ 10 (నాటౌట్), ఫేబియన్ అలెన్ 6 పరుగులు చేశారు. ఆఖర్లో నిఖిల్ చౌదరీ మెరుపు వేగంతో 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. లియామ్ లివింగ్‌స్టోన్ (15 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించడంతో 9.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఆఫ్ఘన్ ఆటగాడి విధ్వంసం
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న జజాయ్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. నార్త్రన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ ఈ ఫీట్‌ను సాధించాడు. వారియర్స్ బౌలర్ అంకుర్ సాంగ్వాన్ జజాయ్ ధాటికి బలయ్యాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఐదో బంతి మినహా మిగిలిన ఐదు బంతులను జజాయ్ సిక్సర్లుగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో జజాయ్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 53 పరుగులు చేశాడు. జజాయ్‌తో పాటు మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నార్త్రన్ వారియర్స్‌పై బంగ్లా టైగర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్రన్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 28 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో మున్రో మినహా ఎవరూ రాణించలేదు. బ్రాండన్ కింగ్ (12), జాన్సన్ చార్లెస్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 7, అజ్మతుల్లా 4, జియా ఉర్ రెహ్మాన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. -
ఆర్సీబీ బ్యాటర్ ఊచకోత
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో అజేయమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్‌స్టోన్ ఊచకోత కారణంగా బంగ్లా టైగర్స్.. ఢిల్లీ బుల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నిఖిల్ చౌదరీ 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిత్ (1), టామ్ బాంటన్ (8), టిమ్ డేవిడ్ (1), ఫేబియన్ అలెన్ (6) విఫలం కాగా.. జేమ్స్ విన్స్ (27), రోవ్‌మన్ పావెల్ (17), షాదాబ్ ఖాన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్.. లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించడంతో 9.4 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. లివింగ్‌స్టోన్‌తో పాటు దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అబుదాబీ టీ10 లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది తొలి విజయం. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కాగా, నిన్న (నవంబర్ 25) ముగిసిన ఐపీఎల్ వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ 8.75 కోట్లకు సొంతం చేసుకుంది. -
మెగా వేలానికి ముందు విధ్వంసం సృష్టించిన డుప్లెసిస్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా చెన్నై బ్రేవ్ జాగ్వర్స్తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. ఫలితంగా ఫాఫ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. చెన్నై బ్రేవ్ ఇన్నింగ్స్‌లో వాన్ డర్ డస్సెన్ 3, జోష్ బ్రౌన్ 13, భానుక రాజపక్ష 18, తిసార పెరీరా 8, క్రిస్ లిన్ 3, కోబ్ హెర్ఫ్ట్ 1 పరుగు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో ఇమాద్ వసీం, ఆమిర్ హమ్జా, ఉడాన, కరీమ్ జనత్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ.. ఫాఫ్ చెలరేగిపోవడంతో మరో 18 బంతులు మిగిలుండగానే (వికెట్ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్‌లో షర్జీల్ ఖాన్ 8, చరిత్ అసలంక 17 పరుగులు చేశారు. చెన్నై బ్రేవ్ బౌలర్లలో ఒషేన్ థామస్‌కు ఓ వికెట్ దక్కింది. కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఫాఫ్ డుప్లెసిస్ ఇవాళ (నవంబర్ 25) ఆక్షన్‌కు రానున్నాడు. ఫాఫ్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫాఫ్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఫాఫ్ కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడవచ్చు. -
చెలరేగిన డేవిడ్ వీస్, మార్కస్ స్టోయినిస్
అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఆటగాళ్లు డేవిడ్ వీస్, మార్కస్ స్టోయినిస్ చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో వీస్ 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 42 పరుగులు చేయగా.. స్టోయినిస్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో కొహ్లెర్ కాడ్మోర్ 11, రిలీ రొస్సో 18, నికోలస్ పూరన్ 0, జోస్ బట్లర్ 3, ఆర్యన్ లక్రా 11 (నాటౌట్) పరుగులు చేశారు. టీమ్ అబుదాబీ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ మిల్నే, మార్క్ అదైర్, రుమ్మన్ రయీస్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ అబుదాబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేయగలిగింది. తద్వారా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫిలిప్ సాల్ట్ (9 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (20 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కడీమ్ అలెన్ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 సిక్సర్లు) టీమ్ అబుదాబీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. టీమ్ అబుదాబీ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ 8, కైల్ మేయర్స్ 9, లారీ ఎవాన్స్ 9, మార్క్ అదైర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణ 2, ఇబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
బట్లర్ ఊచకోత.. డస్సెన్, లిన్ మెరుపులు వృధా
అబుదాబీ టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్.. చెన్నై బ్రేవ్ జాగ్వార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో జోస్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న జోస్.. 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా డెక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (29 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), క్రిస్ లిన్ (28 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు సాధించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నోర్జే, లూక్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గ్లాడియేటర్స్.. బట్లర్, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (24 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర ఉతుకుడు ధాటికి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ అజేయమైన అర్ద శతకంతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్ విధ్వంసం ధాటికి డస్సెన్, లిన్ మెరుపు అర్ద శతకాలు వృధా అయ్యాయి. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ గోల్డన్ డకౌట్ కాగా.. రిలీ రొస్సో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్.. మార్కస్ స్టోయినిస్‌తో (2 నాటౌట్) కలిసి గ్లాడియేటర్స్‌ను గెలిపించాడు. బ్రేవ్ బౌలర్లలో సాబిర్ అలీ రావు 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన డెక్కన్ గ్లాడియేటర్స్ రెండుసార్లు అబుదాబీ టీ10 లీగ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్-2024ను ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఘనంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం సాల్ట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం షేక్ జాయెద్ స్టేడియంలో అజ్మాన్ బోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు.80 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా అజ్మాన్ బోల్ట్స్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్‌ను ఓ ఆటఆడేసుకున్నాడు. అతడి వేసిన 5వ ఓవర్లో సాల్ట్.. 5 సిక్స్‌లు, ఓ ఫోరుతో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతులను మిడ్-వికెట్ మీదగా సిక్సర్లగా మలిచిన సాల్ట్.. ఆ తర్వాత మూడో బంతిని బౌండరీకి తరలించాడు.అనంతరం ఆఖరి మూడు బంతులను రెండు లాంగ్-ఆన్, లాంగ్-ఆఫ్ మీదగా సిక్స్‌లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా టీమ్ అబుదాబి లక్ష్యాన్ని కేవలం 5.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి చేధించింది.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు Salt makes it spicy! 🌶️🥵The swashbuckling English opener smacked 34 runs in an over and finished with 53* (19) leading Team Abu Dhabi to a thumping win in the #AbuDhabiT10 opener! 👊#ADT10onFanCode pic.twitter.com/V0ZiTNjldp— FanCode (@FanCode) November 21, 2024 -
పది మంది స్కోర్లను ఒక్కడే కొట్టేశాడు.. విధ్వంసం సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్
అబుదాబీ టీ10 లీగ్ 2023లో ఆసక్తికర గణాంకాలు నమోదయ్యాయి. టీమ్ అబుదాబీ, బంగ్లా టైగర్స్ మధ్య నిన్న (డిసెంబర్ 4) జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యాటర్ ప్రత్యర్ధి జట్టులోని పది మంది స్కోర్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబీ నిర్ణీత 10 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లా టైగర్స్ బ్యాటర్, ఇంగ్లండ్ యువ ఆటగాడు జోర్డన్ కాక్స్ ఒక్కడే అజేయమైన 56 పరుగులు (23 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. జోర్డన్ చెలరేగడంతో బంగ్లా టైగర్స్ 4.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అబుదాబీ ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌట్లు కాగా.. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆ జట్టు కెప్టెన్ ప్రిటోరియస్ (15), 11వ నంబర్ ఆటగాడు రయీస్ (8 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రయీస్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే అబుదాబీ టీమ్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. టీమ్ అబుదాబీ చేసిన స్కోర్‌లో (65) జోర్డన్ కాక్స్ ఒక్కడే 90 శాతానికి పైగా పరుగులు (56 నాటౌట్) సాధించడం విశేషం. డేనియల్ సామ్స్ (2-0-11-3), గాబ్రియెల్ (2-1-2-2), హోవెల్ (2-0-9-2), డొమినిక్ డ్రేక్స్ (1-0-11-1) బంగ్లా టైగర్స్ పతనాన్ని శాశించారు. అబుదాబీ టీమ్‌లో కైల్ మేయర్స్ (6), అలెక్స్ హేల్స్ (2), టామ్ బాంటన్ (0) లాంటి విధ్వంసకర వీరులు ఉన్నా అతి తక్కువ స్కోర్ల్కే పరిమితమయ్యారు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త నో బాల్.. వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా శనివారం చెన్నై బ్రేవ్స్- నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ బౌలర్ అభిమన్యు మిథున్ విచిత్రమైన నో బాల్‌ను సంధించాడు. చెన్నై బ్రేవ్స్ ఇన్నింగ్స్ 5 ఓవర్లో మిథన్ వేసిన నో బాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 5 ఓవర్లో మూడో బంతిని వేసే క్రమంలో మిథున్ ఓవర్ స్టేప్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. అయితే రిప్లేలో అతడు ఫుట్కు క్రీజుకు మధ్య దూరం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు క్రీజు నుంచి చాలం దూరంలో తన ఫుట్‌ను ల్యాండ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నోబాల్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వారియర్స్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్రేవ్స్ 9.7 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. What's happening in the T10 League? 🤦🏽♂️🤦🏽♂️ #AbuDhabiT10 pic.twitter.com/FGcbshIhPz — Farid Khan (@_FaridKhan) December 2, 2023 -
ఇంగ్లండ్ యువ బ్యాటర్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు
అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జోర్డన్ కాక్స్, పలువురు విండీస్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్న్ వారియర్స్ ఆటగాడు కెన్నార్ లెవిస్ (27 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ ఆటగాడు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 90 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఇదే మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ ఆటగాళ్లు నికోలస్ పూరన్(17 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (16 బంతుల్లో 40 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. కెన్నార్ లెవిస్‌తో పాటు హజ్రతుల్లా జజాయ్ (27 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టీమ్ అబుదాబీపై నార్త్ర్న్ వారియర్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్‌పై మోర్స్విల్లే ఆర్మీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. అసలంక (31), కోబ్ హెర్ఫ్ట్ (20) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఛేదనలో ఆండ్రీయస్ గౌస్ (43), ఫాఫ్ డుప్లెసిస్ (31) రాణించడంతో మోర్స్విల్లే 9.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ జోర్డన్ కాక్స్ విజృంభించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 143 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్.. పూరన్ , ఫేబియన్ అలెన్ చెలరేగినా లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
రఫ్ఫాడించిన రాయ్.. దంచికొట్టిన డికాక్
అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 29) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు చెలరేగిపోయారు. టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్ ఆటగాడు జేసన్ రాయ్ (39 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు).. బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ స్ట్రయికర్స్ ఆటగాడు కుశాల్ పెరీరా (20 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. వీరితో పాటు ఆండ్రీ రసెల్ (5 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (20 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (13 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) లాంటి విండీస్ స్టార్లు ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మ్యాచ్ ఫలితాల విషయానికొస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్‌పై ఢిల్లీ బుల్స్ (డికాక్ జట్టు) 9 వికెట్ల తేడాతో.. టీమ్ అబుదాబీపై చెన్నై బ్రేవ్స్ (జేసన్ రాయ్ జట్టు) 4 పరుగుల తేడాతో.. బంగ్లా టైగర్స్‌పై న్యూయార్క్ స్ట్రయికర్స్ (కుశాల్ పెరీరా జట్టు) 8 వికెట్ల తేడాతో విజయాలు సాధించాయి. -
వరల్డ్ కప్‌లో తుస్సుమనిపించాడు.. అక్కడ మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నాడు!
అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ మరో సారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్‌కు పూరన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా నార్తర్న్ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పూరన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 32 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 80 పరుగులు సాధించాడు. పూరన్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 10 ఓవర్లలో గ్లాడియేటర్స్ మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అతడితో పాటు కోహ్లర్-కాడ్మోర్(32) పరుగులతో రాణించాడు. అనంతరం 139 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. వారియర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడమ్ లైత్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన పూరన్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పూరన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో వెస్టిండీస్‌కు సారథ్యం వహించిన పూరన్.. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన పూరన్ కేవలం 25 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మెగా టోర్నీలో వెస్టిండీస్.. స్కాట్లాండ్, ఐర్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి క్వాలిఫియర్ రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్ విండీస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. The Gladiators captain is named Player of the Match for his outstanding innings 💪 8️⃣0️⃣ runs 3️⃣2️⃣ balls 2️⃣5️⃣0️⃣ strike rate @nicholas_47 🤝 #AbuDhabiT10 #InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/lYIgKUTqwa — T10 League (@T10League) November 25, 2022 చదవండి: IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డే కష్టమే! -
కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో!
అబుదాబి టీ10 లీగ్‌లో దక్కన్ గ్లాడియేటర్స్ బోణీ కొట్టింది. టీమ్ అబుదాబితో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. అబుదాబి బ్యాటర్లలో జెమ్స్ విన్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక గ్లాడియేటర్స్ బౌలింగ్‌లో జహూర్ ఖాన్, హెల్మ్ తలా రెండు వికెట్లు సాధించగా.. షమ్సీ, లిటిల్ చెరో వికెట్ పడగొట్టారు. పూరన్ విధ్వంసం ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్కన్ గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గ్లాడియేటర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓడియన్ స్మిత్ 23 పరుగులతో రాణించాడు. టీమ్ అబుదాబి బౌలర్లలో పీటర్ హట్జోగ్లూ, అలెన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ టోర్నీ ఆరంభానికి ముందు రోజే వెస్టిండీస్ కెప్టెన్సీకి నికోలస్ పూరన్ రాజీనామా చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. The Grind is on. The Gladiators⚔️ are ready. It's gonna be EPIC💥!#CricketsFastestFormat @T10League 🏆#DeccanPhirJeetaga🏆 #AbuDhabiT10 #Season6 #InAbuDhabi #DeccanGladiators #HumHaiDakshin #deccanagain #heretowin pic.twitter.com/JNd1P9stIQ — Deccan Gladiators (@TeamDGladiators) November 23, 2022 చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం -
బీసీసీఐతో తెగదెంపులు చేసుకున్న రైనా.. ఫారిన్ లీగ్‌లో అరంగేట్రం
టీమిండియా మాజీ మిడిలార్డర్ బ్యాటర్ సురేశ్ రైనా భారత క్రికెట్‌తో బంధాన్ని తెంచుకున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సైతం ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన చిన్న తలా.. బీసీసీఐ, తదితర అనుబంధ క్రికెట్ బోర్డులతో తెగదెంపులు చేసుకున్నాడు. గతేడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో నిరాశచెందిన రైనా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. బీసీసీఐతో బంధం తెగిపోవడంతో రైనా చూపు ఇప్పుడు విదేశీ లీగ్‌లపై పడింది. దుబాయ్ వేదికగా జరుగనున్న అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు రైనా సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో రైనా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ డెక్కన్ గ్లాడియేటర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. టీ20 క్రికెట్‌కు భారత్ అందించిన అతి గొప్ప క్రికెటర్ సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ట్వీట్ కూడా చేసింది. కాగా, రైనా ప్రాతినిధ్యం వహించబోయే డెక్కన్ గ్లాడియేటర్స్ తరఫున విండీస్ స్టార్ ఆటగాళ్లు ఆండ్రీ రసెల్, నికోలస్ పూరన్‌లు ఆడుతున్నారు. ఈ లీగ్ ఈ ఏడాది నవంబర్ 23 నుంచి డిసెంబర్ 4 వరకు జరుగనుంది. -
Abu Dhabi T10 League: టీ10 లీగ్‌లో ఆడనున్న హర్భజన్, రైనా
అబుదాబి టీ10 లీగ్-2022లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా భాగం కానున్నారు. ఈ లీగ్‌లో ఢిల్లీ బుల్స్‌తో హర్భజన్ సింగ్ ఒప్పందం కుదుర్చుకోగా.. డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ గ్లాడియేటర్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించనున్నాడు. డక్కన్ గ్లాడియేటర్స్ జట్టుకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా గ్లాడియేటర్స్ జట్టులో టిమ్ డేవిడ్, రహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్, డొమినిక్ డ్రేక్స్, ఫజల్హాక్ ఫరూకీ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టుకు జింబాబ్వే మాజీ ఆటగాడు అండీ ఫ్లవర్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అబుదాబి టీ10 లీగ్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. Indian legend Harbhajan Singh has signed for @DelhiBullsT10 and will be joining us in #Season6 of the #AbuDhabiT10 🔒#InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/d4A8N7DJr2 — T10 League (@T10League) September 29, 2022 ఇక సురేష్ రైనా ప్రస్తుతం రోడ్ సెప్టీ లీగ్‌లో ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా హర్భజన్ సింగ్ లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మణిపాల్ టైగర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. హార్భజన్ సింగ్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోగా.. రైనా ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి' -
రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్ ఐపీఎల్!
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఇటీవలే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అబుదాబి టీ10లీగ్‌లో రైనా పాల్గొనున్నాడన్నది ఆ వార్త సారంశం. అంతేకాకుండా ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్ తరపున ఆడనున్నుట్లు అతడి అభిమానులు ట్విటర్ వేదికగా హల్చల్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని దైనిక్ జాగరణ్ కూడా తమ నివేదికలో పేర్కొంది. Suresh Raina will play the Abu Dhabi T10 league!❣️🔥@ImRaina #SureshRaina pic.twitter.com/DOukgFOD8Q — That's Raina For You (@Thatsrainaforu) September 28, 2022 " నేను ఇంకా రెండు, మూడు ఏళ్లు ఆడాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్‌లో దేశీయ జట్టులో ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. నేను ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోషియషన్ నుంచి అనుమతి దృవీకరణ పత్రం కూడా పొందాను. విదేశీ లీగ్‌లలో ఆడేందకు సముఖత చూపిస్తున్నాను" అని రైనా పేర్కొన్నట్లు దైనిక్ జాగరణ్ వెల్లడించింది. కాగా రైనా ప్రస్తుతం రోడ్‌సెప్టీ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ ఈవెంట్లో మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక ఇంతకుముందు అబుదాబి టీ10 లీగ్‌లోఅబుదాబి వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఎస్ బద్రీనాథ్, రీతీందర్ సింగ్ సోధి, మునాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్ వంటి భారత మాజీ ఆటగాళ్లు భాగమయ్యారు. చదవండి: Ind Vs SA: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ -
యువరాజ్ సింగ్ సరికొత్త అవతారం.. న్యూయార్క్ స్ట్రైకర్స్ మెంటార్‌గా!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరికొత్త అవతరమెత్తనున్నాడు. అబుదాబి టీ10 లీగ్-2022 సీజన్‌కు గానూ న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టు మెంటార్‌గా యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. కాగా యువరాజ్ అబుదాబి టీ10 లీగ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. 2019 ఈ టోర్నీ సీజన్లో మరాఠా అరేబియన్స్‌కు యువీ ప్రాతినిథ్యం వహించాడు. ఇక 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న యువీ.. బీసీసీఐ అనుమతితో కొన్ని గ్లోబల్ ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో ఆడాడు. అదే విధంగా లీజెండ్స్ లీగ్ క్రికెట్, రోడ్ సెప్టీ వంటి లీగ్‌ల్లో కూడా యువరాజ్ భాగంగా ఉన్నాడు. అబుదాబి టీ10 లీగ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో న్యూయార్క్ స్ట్రైకర్స్ ఒప్పందం కుదర్చుకుంది. చదవండి: ICC T20I Rankings: దుమ్ము రేపిన మంధాన.. నెంబర్ 1 స్థానానికి చేరువలో! -
కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న శ్రీశాంత్
టీమిండియా మాజీ బౌలర్, వివాదాస్పద ఆటగాడు శాంతకుమరన్ శ్రీశాంత్ త్వరలో మరో కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది చివర్లో (నవంబర్) ప్రారంభమయ్యే అబుదాబీ టీ10 లీగ్ నుంచి మెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సారధ్యం వహించనున్న బంగ్లా టైగర్స్‌కు శ్రీశాంత్ తన సేవలందించనున్నాడు. ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా బంగ్లా మాజీ ఆల్‌రౌండర్ ఆఫ్తాబ్ అహ్మద్ వ్యవహరించనుండగా.. అదే దేశానికే చెందిన నజ్ముల్ అబెదిన్ ఫహీమ్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేయనున్నాడు. ఈ ఇద్దరితో కలిసి శ్రీశాంత్ కోచింగ్ టీమ్‌లో ఉంటాడని బంగ్లా టైగర్స్ యాజమాన్యం శనివారం వెల్లడించింది. కాగా, అబుదాబీ ఐదో సీజన్ కోసం బంగ్లా టైగర్స్ కీలక మార్పులు చేసింది. ఐకాన్ ప్లేయర్ కోటాలో షకీబ్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడంతో పాటు విధ్వంసకర ఆటగాళ్లు ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కొలిన్ మన్రో (న్యూజిలాండ్).. స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ (పాకిస్థాన్), శ్రీలంక యువ సంచలనం మతీశ పతిరణను జట్టులో చేర్చుకుంది. సఫారీ స్టార్ ఆటగాడు డుప్లెసిస్ సారధ్యంలో గత సీజన్ బరిలో నిలిచిన బంగ్లా టైగర్స్ మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది మార్చిలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీశాంత్.. తొలిసారి కోచింగ్ డిపార్ట్మెంట్లో చేరాడు. గతంలో టీమిండియా క్రికెటర్‌గా, సినిమాల్లో హీరోగా నటించిన ఈ కేరళ స్పీడ్‌స్టర్.. త్వరలో సరికొత్త అవతారంలో క్రికెట్ ఫ్యాన్స్ ముందుకు రానున్నాడు. ఐపీఎల్ (2013 సీజన్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో శ్రీశాంత్ కెరీర్‌కు అర్థంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. 2022 ఐపీఎల్ వేలంలో కనీస ధర యాభై లక్షలకు తన పేరును నమోదు చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న బుడ్డోళ్లు -
బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో..
Andre Russell helps Deccan Gladiators crowned champions of Abu Dhabi T10 Season 5: ఆండ్రీ రస్సెల్ విద్వంసం సృష్టించడంతో తొలిసారిగా అబుదాబి టీ10 టైటిల్‌ను డెక్కన్ గ్లాడియేటర్స్ ముద్దాడింది. డిసెంబర్ 4న జరిగిన ఫైనల్లో ఢిల్లీ బుల్స్‌పై 56 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడిబ్యాటింగ్ దిగిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఓపెనర్లు రస్సెల్, కోహ్లర్-కాడ్మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి 159 పరుగల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నీర్ణీత 10 ఓవరల్లో వికెట్ నష్టపోకుండా గ్లాడియేటర్స్ 159 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆండ్రీ రస్సెల్ కేవలం 32 బంతుల్లో 9 ఫోర్లు , 7 సిక్సర్లతో 90 పరుగులు సాధించాడు. అదే విధంగా కోహ్లర్-కాడ్మోర్ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బుల్స్ నీర్ణీత 10 ఓవరల్లో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బుల్స్ బ్యాటరల్లో చంద్రపాల్ హేమ్రాజ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డెక్కన్ గ్లాడియేటర్స్ బౌలరల్లో ఒడియన్ స్మిత్, వనిందు హసరంగా, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఆండ్రీ రస్సెల్ ఎంపికకగా, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌ను వనిందు హసరంగా దక్కించుకున్నాడు. చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు -
Wanindu Hasaranga: వారెవ్వా హసరంగ.. పాదరసంలా కదిలి.. ఎగిరి..
Wanindu Hasaranga Jaw Dropping Effort T10 League Video Goes Viral: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హసరంగ.. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. చెన్నై బ్రేవ్స్‌తో మ్యాచ్‌లో పాదరసంలా కదిలి.. జట్టుకు ఐదు పరుగులు సేవ్ చేశాడు. సిక్సర్ ఖాయమనుకున్న తరుణంలో హసరంగ బంతిని ఆపడంతో కంగుతినడం బ్యాటర్ వంతైంది. అబుదాబిలో షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డేవిడ్ వీజ్ బౌలింగ్‌లో ఓపెనర్ మహ్మద్ షెహజాద్ భారీ షాట్ ఆడాడు. సిక్స్ ఖాయం అనుకున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హసరంగ మెరుపులా కదిలి బంతిని లోపలికి విసిరాడు. ఎలాగో ఆరు పరుగులు వస్తాయి కదా అనుకున్న చెన్నై బ్రేవ్స్ హసరంగా షాక్‌తో ఒక పరుగు మాత్రమే సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హసరంగ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో దక్కన్ గ్లాడియేటర్స్ 5 వికెట్ల తేడాతో బ్రేవ్స్‌పై గెలుపొందింది. చదవండి: Ind Vs Nz 1st Test Highlights: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. Wow wow Wanindu 😱😱#CBvsDG pic.twitter.com/H7IeUxlVIj — Stay Cricket (@staycricket) November 26, 2021