ఆర్సీబీ బ్యాటర్‌ ఊచకోత | Abu Dhabi T10 League: Liam Livingstone Madness, Smashed 50 Runs From 15 Balls To Help Bangla Tigers | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ బ్యాటర్‌ ఊచకోత

Published Tue, Nov 26 2024 10:17 AM | Last Updated on Tue, Nov 26 2024 11:09 AM

Abu Dhabi T10 League: Liam Livingstone Madness, Smashed 50 Runs Of 15 Balls

అబుదాబీ టీ10 లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్‌.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో అజేయమైన హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్‌స్టోన్‌ ఊచకోత కారణంగా బంగ్లా టైగర్స్‌.. ఢిల్లీ బుల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ బుల్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నిఖిల్‌ చౌదరీ 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్‌ చేయడానికి దోహదపడ్డాడు. 

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆడమ్‌ లిత్‌ (1), టామ్‌ బాంటన్‌ (8), టిమ్‌ డేవిడ్‌ (1), ఫేబియన్‌ అలెన్‌ (6) విఫలం కాగా.. జేమ్స్‌ విన్స్‌ (27), రోవ్‌మన్‌ పావెల్‌ (17), షాదాబ్‌ ఖాన్‌ (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా టైగర్స్‌ బౌలర్లలో డేవిడ్‌ పేన్‌, జాషువ లిటిల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ ఖాన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్‌.. లివింగ్‌స్టోన్‌ విధ్వంసం సృష్టించడంతో 9.4 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. లివింగ్‌స్టోన్‌తో పాటు దసున్‌ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్‌ (20 బంతుల్లో 24; ఫోర్‌, సిక్స్‌) రాణించారు. 

ఢిల్లీ బౌలర్లలో షాహిద్‌ ఇక్బాల్‌, షాదాబ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అబుదాబీ టీ10 లీగ్‌ ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది తొలి విజయం. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కాగా, నిన్న (నవంబర్‌ 25) ముగిసిన ఐపీఎల్‌ వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ 8.75 కోట్లకు సొంతం చేసుకుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement