
సుప్రీంకోర్టుకు శ్రీనివాసన్ బేషరతు క్షమాపణ
న్యూఢిల్లీ: బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఫిబ్రవరి 8 వ తేదీన జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ పాల్గొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఆయన తరఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకు శ్రీనివాసన్ తరఫున క్షమాపణలు తెలియజేశారు. మార్చి 2వ తేదీన జరిగే బీసీసీఐ సమావేశానికి శ్రీనివాసన్ హాజరుకాబోరని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గత వర్కింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ పాల్గొనడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇలా చేసి ఉండాల్సింది కాదు... విరుద్ధమైన ప్రయోజనాలేవో మాకు కనిపిస్తున్నాయంటూ సుప్రీం అప్పట్లో వ్యాఖ్యానించింది.