‘నన్ను కొనసాగనివ్వండి’
బోర్డు అధ్యక్ష పదవిపై
సుప్రీంలో శ్రీనివాసన్ అఫిడవిట్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకోవాలన్న తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తిరిగి తనను పదవీ బాధ్యతలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ చేసిన అభియోగాల్లో ఎలాంటి వాస్తవాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్‌లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ పారదర్శకంగా జరగాలంటే శ్రీనివాసన్ అధ్యక్ష స్థానం నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
‘ఫిక్సింగ్‌పై జరుగుతున్న వాదనల్లో నాపై పూర్తి నిరాధార, అవాస్తవ ఆరోపణలు తీవ్ర ఆవేదనను కలిగించాయి. అలాగే బోర్డు పదవిలో నేనెందుకు కొనసాగకూడదని కోర్టు తెలిపిందో అర్థం కావడం లేదు. ఈ సెప్టెంబర్‌లో నా పదవీకాలం ముగుస్తుంది కాబట్టి నన్ను కొనసాగించాలని కోరుకుంటున్నాను. నాపై ఎలాంటి విచారణ జరగడం లేదు. నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. బీసీసీఐ రాజ్యాంగంలో తాత్కాలిక అధ్యక్షుడి ప్రతిపాదన లేదు. నా అల్లుడిపై జరుగుతున్న విచారణలో కూడా నేనెలాంటి జోక్యం చేసుకోలేదు’ అని శ్రీనివాసన్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.