మరోసారి నరైన్ మెరుపులు
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓపెనర్ గా వచ్చిన సునీల్ నరైన్ విజృంభించాడు. 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి కోల్ కతా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కోల్ కోత్ చేసిన తొలి 45 పరుగుల్లో 42 పరుగులు నరైన్ కావడం ఇక్కడ విశేషం. కోల్ కతా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగింది. దాంతో గౌతం గంభీర్ కలిసి నరైన్ ఓపెనర్ గా వచ్చాడు. క్రిస్ లిన్ గాయం కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో నరైన్ ను ఓపెనర్ గా ప్రయోగిస్తోంది కోల్ కతా. ఆ ప్రయోగం మరోసారి ఫలించడంతో కోల్ కతా శుభారంభం చేసింది.
ఈ ఐపీఎల్ సీజన్ లో అంతకుముందు కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా నరైన్ దూకుడుగా ఆడాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. మరొకసారి గుజరాత్ పై నరైన్ విరుచుకుపడటంతో కోల్ కతా భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.