హైదరాబాద్ : తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జాతీయ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యదర్శి అమరేందర్ రెడ్డితో కలిసి టోర్నీ వివరాలను ఆయన వెల్లడించారు.
ఈ టోర్నీలో 1486 ఎంట్రీలు వచ్చాయని, అండర్-17, 19 బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని అన్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీలు జరుగుతాయి. నేడు (మంగళవారం) జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విచ్చేయనున్నట్లు మల్‌రెడ్డి రంగారెడ్డి చెప్పారు. ఇండోర్ స్టేడియంలో ఒకేసారి 14 మ్యాచ్‌లు జరిగేలా కోర్టుల్ని సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు రాంచంద్రరావు, ఎ.ఎన్.సూరి, కె.శ్రీనివాసరావు, యు.వి.ఎన్.బాబు, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.