
ప్రపంచ కప్‌లో మూడో స్థానాన్ని నిర్ణయించే మ్యాచ్‌పై ఎవరికీ ఆసక్తి ఉండదు. సహజంగా తర్వాతి రోజు కప్ విజేతను తేల్చే పోటీ గురించే ప్రపంచం ఆలోచిస్తుంటుంది కాబట్టి శనివారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బెల్జియం–ఇంగ్లండ్ మ్యాచ్ కూడా ఇందుకు అతీతం కాదు. ఏదేమైనా ఈ రెండు జట్లు సెమీఫైనల్స్‌లో ఎలా ఆడాయో, ఎందుకు ప్రత్యర్థులను ఓడించలేక పోయాయో అందరికీ తెలుసు. బెల్జియం శక్తివంచన లేకుండా పోరాడినా ఫ్రాన్స్ దాని ఆటలను సాగనివ్వలేదు.
క్రొయేషియాపై పరాజయం పాలైనా యువ ఇంగ్లండ్ జట్టు నన్ను ఆకట్టుకుంది. చాలామంది ఆటగాళ్లకు అనుభవం లేకున్నా, 28 ఏళ్ల అనంతరం సెమీస్ చేరడం ఘనతే. వారిని ఇది సానుకూల దృక్పథంలో ఉంచుతుంది. రక్షణాత్మకంగా ఆడినా గారెత్ సౌత్‌గేట్ (ఇంగ్లండ్ కోచ్) కుర్రాళ్లు ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించారు. స్కోరింగ్ అవకాశాలు సృష్టించుకుంటూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే వారికి కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సెమీస్ ఓటమి భారం నుంచి తేరుకుని పునరుత్తేజం పొంది మరో మ్యాచ్ ఆటడం కష్టమైనదే. అయినా ప్రత్యామ్నాయం లేదు. అప్పటికే నాకౌట్ చేరడంతో లీగ్ దశలో తలపడి నప్పుడు ఈ రెండు జట్లు సురక్షిత స్థితిలో ఉన్నాయి. శనివారం మాత్రం పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆడతాయని భావిస్తున్నా. సహజంగా ఆడితే ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తమ ప్రతిభను సరైన తీరులో ప్రదర్శిస్తే మనం ఈ మ్యాచ్ నుంచి మంచి వినోదాన్ని ఆశించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment