
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పదవికి ఇయాన్ మోర్గాన్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడు. వరల్డ్‌కప్‌లో వెన్నునొప్పి బాధతో సతమతమైన మోర్గాన్.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లే కనబడుతోంది. తాజాగా మోర్గాన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని ఇస్తున్నాయి. కెప్టెన్‌గా కొనసాగాలా.. వద్దా అనేది గత కొన్ని రోజులుగా తనకు ఒక ప్రశ్నగా వేధిస్తుందని, దీనిపై త్వరలోనే కచ్చితమైన నిర్ణయం వెలువరిస్తారనని పేర్కొన్నాడు.
‘నేను పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి కాస్త సమయం పడుతుంది. ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం పెద్ద బాధ్యత. నాకు తప్పుకోవాలని ఉన్నా.. అది చాలా పెద్ద నిర్ణయంగా మారింది. ప్రస్తుత కాలం త్వరగా గడిస్తే పూర్తిగా కోలుకుంటాను. అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. 2021 టీ20 వరల్డ్‌కప్ వరకూ కెప్టెన్‌గా కొనసాగితే అది చాలా పెద్ద నిర్ణయమే అవుతుంది. చూద్దాం.. ఏమి జరుగుతుందో?’ అని మోర్గాన్ పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఫలితంగా నాలుగు దశాబ్దాల ఇంగ్లండ్ కలను మోర్గాన్ నిజం చేసినట్లయ్యింది.