నీరజ్ సంచలనం
జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు
* వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణం సొంతం
* ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు
న్యూఢిల్లీ: కలయా... నిజమా అన్నట్లు ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా పెను సంచలనం సృష్టించాడు. ఎవరూ ఊహించని విధంగా జావెలిన్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పోలాండ్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల నీరజ్ ఈటెను 86.48 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో 84.69 మీటర్లతో జిగిస్‌ముండ్స్ సిర్మాయిస్ (లాత్వియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును నీరజ్ బద్దలు కొట్టాడు. సీనియర్ లేదా జూనియర్ విభాగంలో ఓ భారత అథ్లెట్ ప్రపంచ రికార్డు సాధించడం ఇదే ప్రథమం. ఏ స్థాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనైనా స్వర్ణ పతకాన్ని నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందిన నీరజ్ రియో ఒలింపిక్స్‌కు మాత్రం అర్హత పొందలేకపోయాడు. ఇటీవల జరిగిన ట్రయల్స్‌లో నీరజ్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణామైన 80 మీటర్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. ‘ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని అనుకున్నాను. కానీ అది జరగలేదు. ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నా. అనుకున్నది సాధించాను’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.
ప్రపంచ రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రాను అభినందించిన కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ అతనికి రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. గతంలో 2000లో ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో సీమా పూనియా డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించింది. అయితే ఆమె డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెపై నిషేధం విధించి, స్వర్ణాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే 2002లో ఇదే చాంపియన్‌షిప్‌లో సీమా కాంస్య పతకాన్ని గెలిచింది. 2004లో ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో నవ్‌జీత్ కౌర్ థిల్లాన్ డిస్కస్ త్రోలో కాంస్యం సాధించింది. 2003లో పారిస్‌లో జరిగిన సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అంజూ బాబీ జార్జి లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం దక్కించుకుంది.