23 పరుగులకే చాపచుట్టేశారు..
బ్యాంకాక్:మహిళల ఆసియా కప్ ట్వంటీ 20 క్రికెట్ టోర్నీలో అత్యల్ప స్కోర్లు నమోదు కావడం పరిపాటిగా మారిపోయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో నేపాల్ మహిళలు 16.2 ఓవర్లలో 23 పరుగులకే చాపచుట్టేశారు. సోమవారం జరిగిన ట్వంటీ 20 మ్యాచ్లో నేపాల్ మహిళలు రెండంకెల స్కోరును చేయడానికే అపసోపాలు పడ్డారు. ఓపెనర్ జ్యోతి పాండే(16) మినహా ఎవరూ కనీసం క్రీజ్లో నిలబడే యత్నం చేయకుండానే పెవిలియన్ చేరారు. నేపాల్ మహిళ్లలో ఏడుగురు డకౌట్లుగా పెవిలియన్ చేరగా, మరో క్రీడాకారిణి పరుగులేమీ చేయకుండా క్రీజ్లో నాటౌట్ గా మిగిలింది. దాంతో ఎనిమిది '0' లే నేపాల్ స్కోరు బోర్డులు దర్శనమిచ్చాయి.
లంక మహిళల్లో సుగంధిక కుమారి, రణవీరాలు తలో మూడు వికెట్లు తీసి నేపాల్ పతనాన్ని శాసించగా, రంగసింఘే రెండు వికెట్లు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక మహిళలు రెండు వికెట్లు కోల్పోయి 4.3 ఓవర్లలో విజయం సాధించారు. ఓపెనర్లు యశోదా మెండిస్(4), జయాంగని(1)లు అవుట్ కాగా, కెప్టెన్ హసిని పెరీరా(17 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేసింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో థాయ్ లాండ్ మహిళలు 53 పరుగులకే కుప్పకూలారు. బంగ్లా విసిరిన 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థాయ్ లాండ్ పోరాడకుండానే 18.3 ఓవర్లలో చేతులెత్తేసింది.